సినిమాల ద్వారా సోనూసూద్ ఎంత మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడో తెలీదు గానీ, ఈమధ్య కాలంలో చేస్తున్న సామాజిక సేవ ద్వారా మాత్రం సోనూకి భారీ సంఖ్యలో అభిమాన గణం పోగైంది. సోనూని హీరో.. దేవుడు... అంటున్నారు. ఇది వరకెప్పుడూ సోనూ గురించి ఆసక్తి చూపించనివాళ్లు సైతం.. సోనూ వ్యక్తిగత, వృత్తిగత విశేషాల్ని తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సోనూసూద్‌ని బాగా ఫాలో అవుతున్నారు. సోనూకి సంబంధించిన చిన్న విషయం, చిన్న ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారుతోంది. యథా రాజా, తథా ప్రజా అన్నట్టు.. మీడియా కూడా సోనూపై ఫోకస్ పెట్టింది.
సోనూ రాజకీయాల్లోకి వస్తాడా? వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏ పార్టీ వైపు మొగ్గు చూపించే అవకాశాలున్నాయి? అంటూ డిబేట్లు పెడుతున్నారు. ఇంతటి పాజిటీవ్ ఇమేజ్ - అందరూ హర్షించేదే అయినా, సోనూని మాత్రం ఇరకటాలంలో పడేసే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా సినీ అవకాశాల పరంగా. సోనూ ఇప్పటి వరకూచేసినవన్నీ నెగిటీవ్ పాత్రలే. అవే తనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు సోనూని నెగిటీవ్ పాత్రల్లో చూడడం కష్టం. హీరోకంటే ఎక్కువ ఇమేజ్ వచ్చాక.. హీరో చేత తన్నులు తినే పాత్రల్లో సోనూని ఇక ఊహించలేకపోవొచ్చు. పైగా మన హీరోలకు అబధ్రతా భావం ఎక్కువ. ఇమేజ్, క్రేజ్ పరంగా తమకంటే పిసరంత ఎక్కువ ఉన్నా సరే - అలాంటి వాళ్లతో నటించడానికి మనసొప్పదు. ఒకవేళ కలిసి నటిస్తే.. తమకు రావాల్సిన పేరంతా మరొకరి ఖాతాలో పడిపోతుందన్న భయం. ఇవన్నీ సోనూని ఇకకాటంలో పడేసేవే.
రాజకీయ పరంగానూ.. సోనూకి కొన్ని ఇబ్బందులు తప్పకపోవొచ్చు. ఇప్పటికే సోనూ కొన్ని రాజకీయ ప్రయోజనాల్ని ఆశించే ఇవన్నీ చేస్తున్నాడన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. రేపో.. మాపో... ఏ రాజకీయ పార్టీ అయినా సోనూని ఆహ్వానిస్తే, పొరపాటున సోనూ పాజిటీవ్ గా స్పందిస్తే...`అప్పుడు మేం చెప్పాం కదా` అంటూ మళ్లీ విమర్శలు ఎక్కు పెట్టడానికి ఓ బ్యాచ్ రెడీగా ఉంటుంది. మొత్తానికి సోనూకి ఈ పాజిటీవ్ ఇమేజ్.. కొత్తరకమైన తలనొప్పులు సృష్టించడం ఖాయంలా కనిపిస్తోంది. వీటి నుంచి ఈ హీరో ఎలా బయటపడతాడో చూడాలి.