వెండి తెరకు విలన్ గా పరిచయమై, ఆఫ్ స్క్రీన్ హీరోగా ప్రజల మన్ననలు పొందిన బాలీవుడ్ నటుడు సోను సూద్ తన సహాయక చర్యలతో అందరి మనసులలో హీరోగా నిలిచాడు. కరోనా మహమ్మారి మొత్తం దేశాన్ని కమ్మేసిన తరుణంలో.. లాక్ డౌన్ వల్ల తమ ఇంటికి చేరుకోలేని వేల మంది వలస కార్మికులకు ధైర్యాన్నిస్తూ కొన్ని స్పెషల్ బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసి వాళ్లకు చేయూతనిచ్చాడు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు స్పెషల్ ఫ్లైట్లు వేయించి మరీ ఇంటికి తీసుకొచ్చాడు. అంతే కాకుండా ఏకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎవరికి సహాయం కావాలన్నా ఆదుకునే విధంగా తనవంతు కృషి చేస్తున్నాడు ఈ హీరో.
తాజాగా సోనూ బాటలో మరో బాలీవుడ్ నటుడు చేరాడు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ప్రేక్షకాభిమానం పొందిన 'మనోజ్ బాజ్ పాయ్' తన తోటి సీనియర్ నటుడికి అండగా నిలిచాడు. బాలీవుడ్ నటుడు 'అనుపమ్ శ్యామ్' కొద్దీ రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు.. పరిస్థితి విషమించి ఈ మధ్యే ఐసీయూ లో చేరాడు. తన పరిస్థితిని సోదరుడు అనురాగ్ ట్విట్టర్ లో వ్యక్తపరచగా, మనోజ్ దీని పై స్పందించి అండగా నిలిచాడు. మనోజ్ తో పాటు సోనూసూద్ కూడా తన వంతు సహాయం చేస్తానన్నాడు. మొత్తానికి తెర పై విలన్ వేషాలు వేసే నటులు తెర వెనుక హీరోలు గా మారటం చాలామందికి స్ఫూర్తి నిస్తుంది.