'ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌శ్య‌' మూవీ రివ్యూ & రేటింగ్!

మరిన్ని వార్తలు

నటీనటులు : సత్య దేవ్, హరి చందన, రూప, నరేష్ తదితరులు 
దర్శకత్వం : వెంకటేష్ మహా
నిర్మాత‌లు : విజయ ప్రవీణ, శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
సంగీతం : బిజిబాల్ 
సినిమాటోగ్రఫర్ : అప్పు ప్రభాకర్ 
ఎడిటర్: రవితేజ గిరజాల


రేటింగ్‌: 3/5


మ‌ల‌యాళ ద‌ర్శ‌కులు చెప్పే క‌థ‌లు, ఎంచుకునే పాయింట్లు భ‌లే బాగుంటాయి. భూమి బ‌ద్ద‌లైపోయే.. క‌థ‌లేం ఉండ‌వు. అవ‌న్నీ స‌హ‌జంగా పుట్టుకొచ్చేవే. ఆయా క‌థ‌ల్లో నిజాయ‌తీనే ప్ర‌ధాన ఆక‌ర్ష‌క వ‌స్తువు. ఈమ‌ధ్య మ‌ల‌యాళ చిత్రాల‌పై మ‌న దర్శ‌కులు దృష్టి నిల‌ప‌డానికి కూడా కార‌ణం అదే. 2016 లో మ‌ల‌యాళంలో విడుద‌లైన `మహేశింటే ప్ర‌తీకార‌మ్` సినిమాని తెలుగులో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌శ్య‌`గా రీమేక్ చేశారు. `కంచ‌ర పాలెం` తో తొలి అడుగులోనే ఆక‌ట్టుకున్న వెంక‌టేష్ మ‌హా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. మ‌రి మ‌ల‌యాళ చిత్రాన్ని తెలుగులో  ఏర‌కంగా తీర్చిదిద్దారు?  ఆ క‌థ‌లో ఉన్న నిజాయ‌తీ ఏమిటి?


* క‌థ‌


మ‌హేష్ (స‌త్య‌దేవ్‌) ఓ ఫొటోగ్రాఫ‌ర్‌. చిన్ డౌన్ - అప్ - షోల్డ‌ర్ డౌన్ - ఐస్ ఓపెన్ - అంతే. ఇవి త‌ప్ప ఏం తెలీవు. చాలామంచోడు. ఎవ‌రి జోలికి వెళ్ల‌డు. చిన్న‌ప్ప‌టి నుంచీ ఓ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అలాంటి మ‌హేష్‌.. జీవితంలో ఓ రోజు అనుకోని ఘ‌ట‌న జ‌రుగుతుంది. త‌న‌కు సంబంధం లేని గొడ‌వ‌లో త‌ల‌దూర్చ‌డం వ‌ల్ల‌.. ఓ రౌడీ మూక చేతిలో దెబ్బ‌లు తినాల్సివ‌స్తుంది. దాన్ని అవ‌మానంగా భావిస్తాడు మ‌హేష్‌. ఆ రౌడీ గ్యాంగ్ ని తిరిగి కొట్టేంత వ‌ర‌కూ కాళ్ల‌కు చెప్పులు వేసుకోన‌ని శ‌ప‌థం చేస్తాడు. మ‌రోవైపు తాను ప్రేమించిన అమ్మాయి మరొక‌ర్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. ఈ బాధ‌లో.. త‌న కోపాన్ని, ల‌క్ష్యాన్ని, శ‌ప‌థాన్నీ ఎలా తీర్చుకున్నాడు?  అందుకోసం ఏం చేశాడు?  అన్న‌దే క‌థ‌.


* విశ్లేష‌ణ‌


ఓ మంచివాడికి కోపం వ‌స్తే ఎలా ఉంటుంది?  ఓ సామాన్యుడి ఆత్మాభిమానం దెబ్బ‌తింటే ఏమ‌వుతుంది?  అనేదే ఈ సినిమాలోకి ప్ర‌ధానాంశం. అయితే... టైటిల్ లోలా.. ఉగ్ర‌రూపాలు, భ‌యంక‌ర‌మైన పోరాటాలూ ఏమీ ఉండ‌వు. అన్నీ స‌హ‌జ‌మైన ప్ర‌తీకారాలే.  స‌గ‌టు భావోద్వేగాలే. అర‌కు నేప‌థ్యంలో క‌థ మొద‌ల‌వుతుంది. చాలా నిదానంగా క‌థ‌లోకి ప్రేక్ష‌కుల్ని తీసుకెళ్లాడు ద‌ర్శ‌కుడు. మ‌హేష్ తండ్రి కోసం వెదుకులాట‌, అన్న‌య్య బాబ్జీ చేసిన ప్రేమ స‌హాయం, సుహాస్ అల్ల‌రి.. ఇలా.. చాలా విష‌యాలు చెబుతూ చెబుతూ అస‌లు క‌థ‌లోకి వెళ్లాడు ద‌ర్శ‌కుడు. అర‌టి పండు ద‌గ్గ‌ర మొద‌లైన చిన్న గొడ‌వ - ఉమామ‌హేశ్వ‌ర రావు ఉగ్ర‌రూపం దాల్చేలా చేయ‌డం వెనుక స్క్రీన్ ప్లే బాగుంది.  ఎక్క‌డో మ‌న‌కు సంబంధం లేని విష‌యం ఒక‌టి జ‌రిగితే... దానికి మ‌నం ఎలా ప్ర‌భావితం అవుతాం?  కొన్నిసార్లు మ‌న జీవితం ఎలా తారుమారు అవుతుంద‌న్న విష‌యాన్నిచాలా బాగా చూపించాడు ద‌ర్శ‌కుడు.


మ‌హేష్ అవ‌మాన భారం ఎపిసోడ్ త‌ర‌వాత సినిమా అంతా యాక్ష‌న్ వైపు ప‌రుగులు తీస్తుందేమో అనుకుంటారు. కానీ. అదేం జ‌ర‌గ‌దు. య‌ధావిధిగా మ‌హేష్ జీవితం మ‌ళ్లీ సాధార‌ణంగానే మొద‌ల‌వుతుంది. మ‌రో ప్రేమ‌క‌థ‌తో సినిమా ట‌ర్న్ తీసుకుంటుంది. చివ‌ర మ‌ళ్లీ.. ప్ర‌తీకారం ఎపిసోడ్. అయితే.. ఇవ‌న్నీ ఏదో కావాల‌ని పేర్చిన స‌న్నివేశాలు కాదు. ఒక‌దాని త‌ర‌వాత‌... ఒక‌టి అల్లిన అంద‌మైన మాల‌. ప్ర‌తీ స‌న్నివేశాన్ని విడ‌మ‌ర‌చి చెప్ప‌డం, డీటైలింగ్ ఎక్కువ అవ్వ‌డం వ‌ల్ల‌.. అక్క‌డ‌క్క‌డ పాసింజ‌ర్ రైలులా విసిగెత్తించినా, కాస్త ఓపిగ్గా చూస్తే.. 
ఎమోష‌న్ ని అర్థం చేసుకుంటే, త‌ప్ప‌కుండా రెండు గంట‌ల స‌మాయానికి సార్థ‌క‌త చేకూరుతుంది.


* న‌టీన‌టులు


ఉమామ‌హేశ్వ‌ర్ పాత్ర‌లో భ‌లే బాగా ఇమిడిపోయాడు స‌త్య‌దేవ్‌. తాను త‌ప్ప ఇంకెవ‌రూ ఈ పాత్ర‌కు న్యాయం చేయ‌లేరేమో అనిపించింది. అన్నిర‌కాల ఎమోష‌న్స్ నీ చ‌క్క‌గా ప‌లిచించాడు. న‌రేష్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. సుహాస్ కి మ‌రోసారి గుర్తుండిపోయే పాత్ర ప‌డింది. మిగిలిన‌వాళ్లంతా ఎవ‌రి బాధ్య‌త వాళ్లు చ‌క్క‌గా నిర్వ‌హించారు. న‌టీన‌టుల ప‌రంగా.. ద‌ర్శ‌కుడు ఎక్క‌డా త‌ప్పు చేయ‌లేదు.

 

* సాంకేతిక వ‌ర్గం


కెమెరా ప‌నిత‌నం బాగుంది. అర‌కు అందాల్ని బాగా చూపించారు. నేప‌థ్య సంగీతం హాయిగా ఉంది. పాట‌లూ ఫ్లోలో వెళ్లిపోతాయి. మాట‌లు ఆక‌ట్టుకుంటాయి. వెంక‌టేష్ మ‌హా.. మాతృక‌ని అర్థం చేసుకుని, దాన్ని బాగా అడాప్ట్ చేసుకున్నాడు. అయితే... తెలుగులో ఇలాంటి క‌థ‌లు ఎంత వ‌ర‌కూ ఎక్కుతాయి అన్న‌ది అనుమాన‌మే. క‌మ‌ర్షియ‌ల్ హంగులేం లేవు. అక్క‌డ‌క్క‌డ మ‌ల‌యాళ ఛాయ‌లు క‌నిపిస్తుంటాయి. స్లో నేరేష‌న్ ఇంకాస్త ఇబ్బంది పెడుతుంది.


* ప్ల‌స్ పాయింట్స్
ఎమెష‌న్స్‌
స‌త్య‌దేవ్‌


* మైన‌స్‌పాయింట్స్‌
స్లో నేరేష‌న్‌


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  ఉగ్ర‌రూపం కాదు గానీ.. ఫ‌ర్వాలేదు


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS