కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ రీల్ విలన్ సోను సూద్.. రియల్ హీరో అయ్యారు. కొవిడ్ ఫస్ట్‌వేవ్ లాక్‌డౌన్‌లో తన స్నేహితులతో కలిసి చాలామంది ఆకలి తీర్చిన సోనూ, అదే సమయంలో సొంత ఊరికి నడిచిన వెళ్తున్న వారిని చూసి చలించిపోయారు. కొందరినైనా బస్సులో పంపాలనుకున్న సోనూ ఆలోచన లక్షల మందిని తమ ఇళ్లకు చేర్చారు.
‘అన్నా.. సాయం చేయండి’ అంటూ ట్వీట్ చేయడమే ఆలస్యం ‘నేనున్నా’ అని భరోసా ఇచ్చి ఎన్నో ప్రాణాల్ని కాపాడారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలూ చేయలేని పనుల్ని చేసి చూపించి రియల్ హీరో అనిపించుకున్నారు. ఇప్పుడు సోనూ చాలా మంది ఆరాధ్య దైవం. ఇప్పటికే ఈ హీరోపై ఉన్న అభిమానంతో పలుచోట్ల గుడి కట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ హీరోకు మరో ఆలయం నిర్మిస్తున్నారు ఆయన అభిమానులు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో దీన్ని నిర్మిస్తున్నారు. అయితే తనకు గుడి అవసరం లేదని దానికి బదులు పేదలకు సాయం చేయండని సూచించారు సోను.
‘‘ నన్ను అభిమానించే వారికి ధన్యవాదాలు. కానీ, నా కోసం గుడి కట్టడం కంటే ఎవరికైనా చదువు చెప్పించండి. పేదల అవసరాలు, ఆకలి తీర్చండి. పాఠశాలలు, ఆసుపత్రులు కట్టడానికి చేతనైనంత సాయం చేయండి’’ అని సోనూసూద్ కోరారు.