తన సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. ప్రతీరోజూ.. ఏదో ఓ వార్తతో సోనూ జనం నోళ్లలో నానుతున్నాడు. తన పాపులారిటీ రోజు రోజుకీ పెరుగుతోంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి రాజకీయ నాయకుల, పార్టీల ప్రయత్నాలూ మొదలయ్యాయి. సోనూని రాజకీయ పార్టీలు ఆహ్వానించడం, సోనూ సున్నితంగా తిరస్కరించడం తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు సోనూకి ఎం.ఎల్.సీ పదవి ఇచ్చి, గౌరవించాలనుకుంది ఓ రాజకీయ పార్టీ. అయితే.. సోనూ సున్నితంగా తిరస్కరించాడని టాక్. తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని - కొన్నాళ్లు ఏ పార్టీ అండ లేకుండానే ప్రజా సేవ చేసుకుంటానని చెప్పాడట.
``సోనూని చాలా రాజకీయ పార్టీలు ఆహ్వానించాయి. కానీ సోనూ అటు వైపు ఆకర్షితుడవ్వలేదు. ఇటీవల ఎంఎల్‌సీ ఆఫర్ కూడా వచ్చింది. కానీ.. సోనూ స్పందించలేదు. ఆయనకు రాజకీయాల్లో దిగడం ఇష్టం లేదు. ఓ పార్టీ వ్యక్తిగా చెప్పుకోవడం ఇష్టం లేదు. అందుకే వాటికి దూరంగా ఉంటున్నారు`` అని సోనూ సన్నిహితుడొకరు చెప్పుకొచ్చారు. ఇటీవల సోనూ.. తన పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చాలామంది రాజకీయ నేతలు ఆయనకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంలోనే ఎం.ఎల్.సీ ప్రస్తావన వచ్చిందని టాక్.