'వదల బొమ్మాళీ వదల..' డైలాగ్ ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ డైలాగ్‌ని పేల్చిన 'పశుపతి' పాత్ర కూడా అంతే పాపులారిటీ దక్కించుకుంది. పశుపతి పాత్రలో సోనూసూద్ ముద్ర ఆ స్థాయిలో వేసేశాడు 'అరుంధతి' సినిమాతో. 'అరుంధతి'గా జేజమ్మ పాత్రకి అంత వెయిట్ వచ్చిందంటే, ఆ సినిమాలో విలన్ పాత్ర తాలూకు క్రూరత్వం, కఠినత్వం ప్రత్యేక కారణాలుగా చెప్పొచ్చు.
ఇప్పుడు ఆ పశుపతి 'మణికర్ణిక' సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్‌లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది క్వీన్ కంగనా రనౌత్. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సోనూ సూద్‌కి ఓ మంచి పాత్ర దక్కింది. ఈ సినిమాలో సోనూ సూద్ మరాఠీ రాజు పాత్రలో మెప్పించనున్నాడు. సినిమాకి 'సదాశివ్' అనే ఈ మరాఠీ రాజు పాత్ర చాలా కీలకమట. మరాఠీ రాజు గెటప్‌లో సోనూసూద్ ఫోటోలు బయటికి వచ్చాయి. అవిప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.
నిజానికి ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోగలడు సోనూసూద్. సీరియస్ క్యారెక్టర్ అయినా, కామెడీ క్యారెక్టర్ అయినా, సీరియస్‌గా కనిపిస్తూనే కామెడీని పండించగలడు. కామెడీ చేస్తూనే విలనిజం కూడా చూపించగలడు. అంత గొప్ప యాక్టింగ్ టాలెంట్ ఉన్న నటుడు సోనూసూద్. ఇకపోతే, గతంలో బాలకృష్ణతో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా తెరకెక్కించి, హిస్టరీని కళ్లకు కట్టినట్లు చూపించడంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు క్రిష్.
ఈ సినిమాతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.