దివంగత గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. ప్రతీ యేటా రిపబ్లిక్ డేని పురస్కరించుకుని కేంద్రం పద్మ అవార్డుల్ని ప్రకటించే సంగతి తెలిసిందే. ఈసారి.. బాలుకి పద్మ విభూషణ్ దక్కింది. గతంలో బాలుకి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందాయి. బాలు మరణానంతరం ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ప్రముఖంగా వినిపించింది. అయితే.. ఈసారి ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చి సరిపెట్టింది కేంద్రం.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇలా.. భాషతో పని లేకుండా సంగీత ప్రపంచాన్ని, శ్రోతలనూ తన గాత్రంతో ఓలలాడించిన బాలు.. దాదాపు 40 వేలకు పైగానే పాటలు పాడారు. దాదాపు మూడు దశాబ్దాలు అలుపు లేకుండా పాడుతూనే ఉన్నారు. పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎన్నో కొత్త గళాల్ని వెలుగులోకి తెచ్చారు. బాలు కృషికి 2001లో పద్మశ్రీ వరించింది. 2011లో పద్మభూషణ్ సైతం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే నంది అవార్డుల్ని ఏకంగా 25 సార్లు అందుకున్నారు.
బాలు పూర్తి పేరు పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో జన్మించారు. తండ్రి సాంబమూర్తి, తల్లి శంకుతలమ్మ. తండ్రి హరి కథా కళాకారుడు. అందుకే పాడడం ఇంట్లోనే ఉంది. తండ్రిని చూస్తూ... బాలు కూడా పాడడం మొదలెట్టారు. ఇంజనీరింగ్ చదువుతూ.. వేదికలపై పాటలు పాడడం మొదలెట్టారు. 1966లో `మర్యాదరామన్న` సినిమాతో తొలిసారి గాయకుడి అవతారం ఎత్తారు. అప్పటి నుంచి.. ఆయన వెను దిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. కథానాయకుడి శైలిని, గొంతునీ అనుసరిస్తూ పాటలు పాడడం బాలు ప్రత్యేకత. కృష్ణ, అక్కినేని, చిరంజీవి, బాలకృష్ణ.. ఎవరికి పాట పాడుతున్నారో గ్రహించి - దానికి తగ్గట్టు తన గొంతు మార్చుకునేవారు. గతేడాది కరోనా సోకడంతో.. బాలు ఆసుపత్రి పాలయ్యారు. కరోనా నుంచి కోలుకున్నా.. ఇతరఅనారోగ్య సమస్యలు తలెత్తడంతో.. సెప్టెంబరు 25న తుదిశ్వాస విడిచారు.