రోజుకి ఓ పాట పాడడంలో వింత లేదు. రెండు పాటలు పాడితే బిజీ సింగరే. మూడూ, నాలుగూ, అయిదు పాటలంటే.. అబ్బో అనుకోవచ్చు. అలాంటిది ఏకంగా 21 పాటలు పాడితే. అది చరిత్ర ఎరుగని అద్భుతం. దాన్ని సాధించిన అపూర్వ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.
80వ దశకంలో బాలూదే హవా. అన్నీ సింగిల్ కార్డులే. అందరు హీరోలకూ బాలూనే కావాలి. పక్కన పాడే, గాయనీమణులు మారేవారు అంతే. ప్రతీ పాటా బాలూదే. 1981 ఫిబ్రవరిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ సారధ్యంలో ఒకేరోజు 21 పాటల్ని రికార్డు చేశారు. ఉదయం 9 గంటలకు మొదలైన రికార్డింగ్ రాత్రి 9 గంటల వరకూ నిరాటంకంగా సాగింది. మధ్యలో ఓ గంట లంచ్ బ్రేక్ తీసుకున్నారంతే. భారతీయ చలన చిత్ర సంగీత ప్రపంచంలో అదో చరిత్రగా నిలిచిపోయింది. మరోసారి ఒకేసారి 19 తమిళ పాటల్ని ఆలపించారు. ఇంకో సందర్భంలో ఒకేరోజు 16 హిందీ గీతాల్ని బాలు రికార్డు చేశారు. ఇవన్నీ మరెవ్వరూ అందుకోలేని ఘనతలే.