16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గురువు ఎవరో తెలుసా.? గురువు కాదు, గురువులు అనాలేమో.! ఎందుకంటే, ప్రతి సంగీత దర్శకుడూ తనకు గురువుతో సమానమని ఎస్పీ బాలు చెబుతుండేవారు. అదే ఆయన ప్రత్యేకత. తనకంటే వయసులో చాలా చాలా చిన్నవాళ్ళని కూడా ఆయన గురువుగానే భావించేవారట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు రఘు కుంచె తాజాగా ఓ ఛానల్ లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు.
రఘు కుంచె ఒక్కరే కాదు, చాలామంది యువ సంగీత దర్శకులు ఇదే మాట చెబుతున్నారు. బాలు లాంటి గొప్ప వ్యక్తి తమ సంగీత దర్శకత్వంలో పాటలు పాడటాన్ని ఓ అద్భుతంగా భావించామని, అయితే పాట పాడే సమయంలో ఆయన తమను గురువుగా భావించి, తాము చెప్పిన విధంగా పాటలు పాడతానని చెప్పడం ఆశ్చర్యపరిచిందని చెబుతున్నారు. నిజమే, అది కూడా బాలుకి సంబంధించి ఓ అరుదైన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. నిజానికి, ఎస్పీ బాలు కూడా సంగీత దర్శకుడిగా పనిచేశారు. అయితే, ఏనాడూ తానొక గొప్ప గాయకుడినన్న గర్వం ఆయనలో వుండేది కాదు.
‘ఈ పాట నాకంటే, యంగ్ సింగర్స్‌కి బావుంటుందేమో..’ అంటూ తాను పాడాల్సిన పాటల్ని కూడా, యువ గాయకులకు వెళ్ళేలా చేసిన వ్యక్తి ఎస్పీ బాలసుబ్రమణ్యం. పాటని మనసుతో పాడటం బాలుకి వెన్నతో పెట్టిన విద్య. బహుశా అందుకేనేమో.. వేర్వేరు బాషల్లోనూ ఆయన సూపర్ హిట్స్ కొట్టగలిగారు.. ఎక్కడా ఓ పదాన్ని పలకడంలో ఇబ్బంది పడిన సందర్భాల్లేవు. ఔను, బాలు నిత్య విద్యార్థి.! ఆయనకి అందరూ గురువులే!