బాలు ప్రభ.. దాదాపు మూడు దశాబ్దాల పాటు వెలిగింది. ఎన్టీఆర్‌కీ ఆయనే.. శోభన్ బాబుకీ ఆయనే. చిరంజీవికీ ఆయనే.. అలీకీ ఆయనే అన్నట్టు సాగింది ఆయన ప్రయాణం. ఆయన పక్కన పాడే ఫిమేల్ సింగర్స్ మారారు గానీ, ఆయన మారలేదు. ప్రతీ ఆడియోలోనూ సింగిల్ కార్డే. ఏ గాయకుడికైనా విరామం అవసరం. ఏదో ఓ సందర్భంలో కొత్త గొంతుకలకు దారి ఇవ్వాలి. జనానికి కూడా మొనాటినీ వచ్చేస్తుంది. కానీ.. బాలు దగ్గర ఆ ఆస్కారమే లేదు. ప్రతీ పాటనీ కొత్తగా పాడాలనుకోవడం,తనదంటూ ఏదో ఓ ఛమక్కు ఆ పాటకు అద్దడంతో - బాలు ఎప్పుడూ బోర్ కొట్టలేదు.
ఆవకాయ్ ముద్ద ఎన్నిసార్లు తిన్నా.. బోర్ ఎందుకు కొడుతుంది..? అమ్మ ప్రేమలా.. బాలు పాటా బోర్ కొట్టే వస్తువు కాదు. కొత్త గాయకులు వచ్చినా సరే... బాలు స్థానం బాలుదే. ఉదిత్ నారాయణ్, హరిహరన్, ఉన్నికృష్ణన్ ఇలా బయటి నుంచి గాయకుల్ని దిగుమతి చేసుకున్నా - అప్పుడప్పుడూ బాలూలా పాడడానికి మనో ట్రై చేసి, ఆయన పాటల్ని కొన్ని కబ్జా చేసినా - బాలు పాట బాలునే వెదుక్కుంటూ వెళ్లింది. అయితే కొన్నాళ్లకు పాటకు తెలుగు గొంతుకు అవసరం లేకపోవడం, ఇప్పుడొస్తున్న చాలామంది యువతరం సంగీత దర్శకులకు, నిర్మాతలకు, దర్శకులకూ బాలు లోని టాలెంట్ అర్థం కాకపోవడంతో.. బాలుకి నిజంగానే గ్యాప్ వచ్చింది.
సినిమాకో కొత్త గాయకుడు పుట్టడం మొదలైంది. దాంతో.. బాలు దాదాపు రిటైర్మెంట్ స్టేజీకి వెళ్లిపోయారు. కానీ... ఇప్పటికీ ఓ మంచి ట్యూన్ వస్తే, ఓ మంచి సందర్భం కుదిరితే - `ఇది బాలూనే పాడాలి..` అనుకునే పాటొస్తే - తప్పకుండా ఆ పాటే బాలుని వెదుక్కుంటూ వెళ్లింది. బాలు పాడడం వల్లే ఆయా పాటలకు కొత్తందాలు వచ్చాయి. `శతమానం భవతి`లో `నిలువదే.. మది నిలువదే.. చెలి సొగసుని చూసి` పాట కానివ్వండి.. `డిస్కోరాజా`లో `నువ్వు నాతో ఏమన్నావో.. నేనేం విన్నానో` పాట కానివ్వండి - ఒక్కసారిగా శ్రోతల్ని ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్లిపోతాయి. యువతరంలో ఎంత ఉత్సాహంగా పాడారో బాలు.. ఇప్పటికీ అదే జోష్ ఆయన గొంతులో వినిపిస్తుంది.
బాలు గొంతులోని ఆ తియ్యందనం, ఆ చిలిపిదనం ఎక్కడికీ పోలేదు అన్న భరోసాని కలిగిస్తాయి. మహాత్మలో `ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ` పాట వినండి... నవతరానికి అదో పాఠం. పాటని భావోద్వేగాలతో ఎలా పాడాలో అర్థం అవుతుంది. ఏ పదాన్ని ఎక్కడ విరవాలో, ఏ అక్షరాన్ని ఎక్కడ ఒత్తాలో తెలుస్తుంది. `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`లో `ఘల్ ఘల్... ` పాట విన్నప్పుడల్లా శరీరంలోని అణువణువూ కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటుంది. ఇవన్నీ కేవలం బాలు కోసమే పుట్టిన పాటలు. బాలు పాడడం వల్లే ఆయా పాటలకు కొత్త సంస్కారం అబ్బింది.
ఇక ముందు కూడా ఇలాంటి పాటలు పుట్టొచ్చు. కానీ.. పాడే నాధుడేడీ? ఇప్పుడు అలాంటి పాటలు ఎవరిని వెదుక్కుంటూ వెళ్తాయి? రాబోతున్న సంగీత కారులు, పాటలు రాద్దామనుకుని ఇప్పుడిప్పుడే కలాలు పట్టుకుని ప్రయాణం మొదలెట్టిన వారికీ... బాలు లేకపోవడం అతి పెద్ద లోటు. బాలు లాంటి ఆత్మీయుడ్ని, బాలు లాంటి మార్గ దర్శకుడ్నీ, బాలు లాంటి పాటల మాస్టారునీ వాళ్లంతా కోల్పోయినట్టే లెక్క.