నా పాటకు తెరపై ప్రాణం చిరంజీవి : ఎస్పీబీ!

మరిన్ని వార్తలు

హైదరాబాద్‌లో శనివారం జరిగిన స్వరసంగమం సంగీత విభావరిలో...సినీ సంగీత వాద్య కళాకారుల ఆర్థిక, ఆరోగ్య సంక్షేమం కోసం నిధుల సేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణకు చెందిన మంత్రి శ్రీనివాస గౌడ్, శాసనసభ్యుడు రసమయి బాలకిషన్, నిర్మాత కె. వెంకటేశ్వరరావు, నటి రేణూ దేశాయ్, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, సినీ మ్యుజీషియన్స్ యూనియన్ కార్యవర్గ ప్రముఖులు గాయని విజయలక్ష్మి (అధ్యక్షురాలు ), కౌసల్య, అర్పీ పట్నాయక్, లీనస్ తదితరులు పాల్గొన్న ఈ సభలో సీనియర్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, వాద్య కళాకారుల గొప్పతనాన్ని గుర్తుచేశారు.

 

వాళ్ళ సంక్షేమం కోసం అందరూ కలసి, ఏదైనా చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. “మేము ఎంత పాడినా, ఏం చేసినా, మా పాటలోని ఫీల్‌ను గ్రహించి, అద్భుతంగా తెరపైన అభినయించినప్పుడే వాటికి సార్థకత. అలా నా పాటలకు అత్యద్భుతంగా అభినయించి, తెరపై ప్రాణం పోసిన ఏకైక నటుడు చిరంజీవి. చిరంజీవిని కేవలం ఓ నటుడు అని నేను అనను. అతను మంచి పెర్ఫార్మర్. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆర్టిస్ట్. కేవలం అభిమానుల ఆనందం కోసం తనలోని అభినయ నైపుణ్య కోణాన్ని కూడా పక్కనపెట్టి, కొన్ని పాత్రలు చేయాల్సి వచ్చింది.

 

చేశారు. ఇప్పుడు రానున్న సైరా లాంటి చిత్రాలు అతనిలోని అభినయ కోణాన్ని మరోసారి చూపెడతాయి” అని ఎస్పీబీ అభిప్రాయపడ్డారు. సీనియర్ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సునీత, కల్పనతో పాటు శ్రీకృష్ణ, శ్రావణ భార్గవి, సింహ, దీపు, హేమచంద్ర తదితర యువ గాయనీ గాయకులు పెద్ద సంఖ్యలో ఈ స్వర సంగమం కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ సినీ సంగీత దర్శకుల సారథ్యంలోని పాటలను ఆలపించి, దాదాపు నాలుగున్నర గంటల పైగా సమయం ఆహూతులను అలరించారు.

 

సంగీత దర్శకులు కోటి, కీరవాణి ,మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, ఆర్పీ పట్నాయక్, అనూప్ రూబెన్స్ , రాధాకృష్ణన్ , కళ్యాణి మాలిక్ , శ్రీలేఖ ,రఘు కుంచె, సాయికార్తీక్ తదితరులు స్వయంగా తమ హిట్ పాటలను గాయనీ గాయకులతో ఈ కార్యక్రమంలో పాడించడం విశేషం. ఏ కోర్సు అయినా నిర్ణీతకాలంలో అయిపోతుంది. కానీ, సంగీత వాద్యకళాకారులు మాత్రం ఎప్పటికప్పుడు కొత్తవి సాధన చేస్తూ, నిత్యవిద్యార్థులుగా జీవితాంతం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే అరుదైన వ్యక్తులని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు.

 

“నా లాంటి ఎందరో గాయనీ గాయకులు ఈ స్థాయికి రావడానికి కారణం సంగీత వాద్యకళాకారుల సహకారమే. అలాంటి కళాకారులకు విదేశాలలో కార్యక్రమాలు, ప్రదర్శనల సందర్భంగా ప్రముఖులకూ, గాయనీ గాయకులతో పాటు సమానమైన గౌరవం, మర్యాద, వసతులు కల్పించడం కనీస ధర్మం. ఆ పని చేయాల్సిందిగా అందరికీ నా అభ్యర్థన” అని ప్రముఖ సినీ గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి విజ్ఞప్తి చేశారు. ఈ స్వర సంగమానికి వాద్యకళాకారుల కుటుంబాలు, అభిమానులు పెద్దయెత్తున తరలివచ్చారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS