తెలుగులో విజయం సాధించిన 'జెర్సీ' సినిమాని తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా, తమిళంలో విష్ణు విశాల్, అమలాపాల్ జంటగా రూపొందనుందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నానికి లవర్‌గా, భార్యగా నటించిన శ్రద్ధా శ్రీనాధ్ పాత్ర విషయమై జోరుగా చర్చ కొనసాగుతోంది. శ్రద్ధా పాత్రకు తెలుగులో మంచి పేరు వచ్చింది. ఆమె పండించిన ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ అందర్నీ కట్టిపడేశాయి.
అమలాపాల్ మంచి నటి. అనుభవమున్న నటి. తన యాక్టింగ్‌లో డిఫరెంట్ వేరియేషన్స్ ఇప్పటికే చూపించేసింది. ఒకవేళ పోషించాల్సి వస్తే, 'జెర్సీ'లో శ్రద్ధా శ్రీనాధ్ పాత్రను డీల్ చేయడం అమలాపాల్‌కి ఏమంత కష్టమైన పని కాదు. ఆ మాటకొస్తే, శ్రద్ధా శ్రీనాధ్‌ని అమలాపాల్ డామినేట్ చేసేస్తుందనడం కూడా అతిశయోక్తి కాదేమో. ఇటీవల 'ఆమె'లో అమలాపాల్ నట విశ్వరూపం చూసేశాం. 'జెర్సీ' ఛాన్స్ కానీ, అమలాపాల్ దక్కించుకుంటే, ఆమె కెరీర్‌కి ఇదో మైల్ స్టోన్ అవుతుందనుకోవచ్చు.
తమిళ నేటివిటీ కోసం కొన్ని చిన్నా చితకా మార్పులు చేయనున్నారట. మరోవైపు ఈ సినిమాకి రానా నిర్మాతగా వ్యవహరించనున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కానీ, అధికారికంగా క్లారిటీ రావల్సి వుంది. ఇదిలా ఉంటే, రీమేక్స్ చేయడంలో ప్రత్యేకమైన అభిరుచిని చాటుకునే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, కమ్ నిర్మాత కరణ్ జోహార్ 'జెర్సీ'ని బాలీవుడ్‌కి తీసుకెళ్లేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. చూడాలి మరి, ఆ వ్యవహారం ఎంతవరకూ వస్తుందో.