“అమ్మ బ్రహ్మ దేవుడో... కొంపముంచినావురో...
ఎంత గొప్ప సొగసురో... ఏడ దాచినావురో...
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా
కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా...”
ఇంతటి గొప్ప మాటలు రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి అగ్ర తాంబూలం అందినా ఆయన రాసిన ఈ మాటలకు అక్షరాల నిండైన రూపం శ్రీదేవిది. ఇది కాదనేవారు బహుశా ఎవరు ఉండకపోవచ్చు.
ఆమె గతించి దాదాపు 24 గంటలు కావోస్తున్నా ఆమె పరమపదించి ఉండదు అని లోలోపల అనుకుంట్టున్న వారు ఇంకా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదేమో. అయితే చాలామంది మంది నటీమణులు మనల్ని అలరిస్తుంటారు వారికి ఏమన్నా అయితే మనం బాధపడడం సహజమే. అయితే ఆ బాధ పరిది దాటి ఇంకాస్త ఎక్కువగా ఆమె కోసం అశ్రువులు కార్చే పరిస్థితి ఒక్క శ్రీదేవికి మాత్రమే వర్తిస్తుంది.
ఆమె ఒక సామాన్య నటి మాత్రమే కాదు అచ్చంగా ఆమెని ఒక ‘మెరుపు’తో పోల్చోచ్చు. ఎందుకంటే ప్రేక్షకులకి ఆమె కేవలం ఒక నటిగా కాకుండా ఎప్పట్టికీ చెదరని ఒక జ్ఞాపకంగా మిగిలిపోయారు. ఒక మెరుపులో ఎంతటి శక్తి ఉంటుందో అలాగే ముఖంలో అంతటి శక్తి ఉంటుంది. ఒక మెరుపు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఎటువంటి అలజడి సృష్టించగలదో అలాంటి అలజడే శ్రీదేవి ప్రేక్షకుల్లో కలిగించేసింది.
ఆమె వెండితెరపైన ఎంతటి హుషారైన పాత్రల్లో మెరిసినా నిజ జీవితంలో మాత్రం ఆమె ఒక సాధారణ గృహిణిగా ఇద్దరు పిల్లల తల్లిగా చాలా పద్దతిగా నడుచుకున్నారు. ఈమెలోని ఈ సుగుణాలు ఆమెని మరింత అందంగా ప్రేక్షకులకి చేరువ చేశాయి. మన మధ్యలో చాలా మంది అందమైన మనుషులు ఉన్నప్పట్టికీ శ్రీదేవి మాత్రం అందమైన శరీరంతో పాటుగా అంతకంటే అందమైన మంచి మనసు కలిగిన వారు అని ఆమెని ఇన్నిరోజుల నుండి చూసిన వారు అంటారు.
ఇక 54 ఏళ్ళ తన జీవన గమనంలో దాదాపుగా 50 సంవత్సరాలు సినీమాలలోనే గడిపిన ఈ అలుపెరగని వెండితెర సుందరి కచ్చితంగా మనకోసమే మన మధ్యలోనికి వచ్చిన ఒకఅధ్బుతం.
తన ‘అందమైన’ అభినయంతో ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికి చెరగని ముద్రవేసేసింది. ఆమె భౌతికంగా ఈ భూలోకం విడిచినప్పట్టికి ఆ పైన ఇంద్రలోకం అంటూ ఒకటి ఉంటే ఆమె మనకోసమే గనుక ఇక్కడికి వచ్చి ఉంటే కచ్చితంగా ఆమె అక్కడికే వెళ్ళి ఉంటుంది అని అనుకుంటున్నాను.
- సందీప్