'ఆర్.ఆర్.ఆర్' తరవాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో జాన్వీ కపూర్ తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మనవడు, శ్రీదేవి కూతురు కలిసి చేస్తున్న సినిమా కాబట్టి, ఈ కాంబోపై ప్రత్యేకమైన అంచనాలు ఉండడం ఖాయం. దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్, శ్రీదేవిల సూపర్ హిట్ గీతాన్ని ఈ సినిమా కోసం రీమిక్స్ చేస్తారని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది. 'వేటగాడు' సినిమాలోని 'ఆకుచాటు పిందె తడిసె' పాట 'దేవర' కోసం వాడే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే... ఇది కేవలం గాసిప్ మాత్రమే అని, ఇందులో ఏమాత్రం నిజం లేదని టాక్. ఎందుకంటే ఈపాటని ఇప్పటికే రీమిక్స్ చేసేశారు. 'అల్లరి రాముడు'లో 'రెండు వేల రెండు వరకూ' అంటూ ఎన్టీఆర్, ఆర్తి అగర్వాల్ ఆడిపాడారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. కాబట్టి ఆ పాటే మళ్లీ రీమిక్స్ చేయడం కష్టం. పైగా ఎన్టీఆర్ కూడా రీమిక్స్ పాటలంటే పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. తాతగారి పేరునీ, పాటల్నీ ఇది వరకే చాలా సినిమాల్లో వాడేశానని, మళ్లీ అదే చేస్తే, ఆడియన్స్ బోర్ ఫీలౌతారని సున్నితంగా చెబుతున్నాడట. సో.. 'దేవర'లో ఏ సినిమాలోని పాటనీ రీమిక్స్ చేయకపోవొచ్చు. 'దేవర'ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 ఈ దసరాకు విడుదల కానుంది.