అది పాత విషయం, కొత్తగా గొడవ చేస్తామంటే కుదరదని శ్రీముఖి తన చుట్టూ ఇటీవల నెలకొన్న వివాదంపై స్పందించింది. ఓ ఛానల్‌లో ప్రసారమయిన ఓ కార్యక్రమంలో శ్రీముఖి, ఎవర్నో కించపర్చిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు కేసు నమోదయ్యింది. విచారణ జరుగుతోంది. పాత ఈవెంట్‌ని కొత్తగా ఇంకోసారి ప్రసారం చేశారని, దాని మీద వివాదాలు చేయడం వల్ల ఉపయోగం లేదని శ్రీముఖి అంటోంది. శ్రీముఖి వాదనలో నిజమెంత.? అంటే, కొంత నిజం లేకపోలేదు. కొందరు పనిగట్టుకుని వివాదాలు సృష్టించడం, సెలబ్రిటీలు ఆ వివాదాలతో ఇబ్బంది పడడం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వివాదాలు ఉత్త పబ్లిసిటీ స్టంట్లుగానే మిగిలిపోతున్నాయి కూడా.
అయితే, శ్రీముఖి అంత తేలిగ్గా ఈ వివాదాన్ని తీసుకోవడానికి వీల్లేదు. టెలికాస్ట్ అయిన విషయం పాతదైనా, కొత్తదైనా.. అందులో అభ్యంతకర విషయాలుంటే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి విచారణ ఎదుర్కోక తప్పదని కొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయినా, కామెడీ పేరుతో చాలా చాలా అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు కమెడియన్లు ఆయా షోలలో. కొన్ని సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, ఇంకొన్ని సార్లు వ్యవహారం కోర్టుల దాకా వెళుతోంది. సినిమాలూ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఏదిఏమైనా, ఈ విషయంలో శ్రీముఖిని తప్పుపట్టడానికేమీ లేదని సినీ, టీవీ మీడియాకి సంబంధించిన కొందరు అభిప్రాయపడుతున్నారు.