సినిమా ప్రమోషన్‌లో ఇదో కొత్త పోకడ అనుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది. అదేమిటంటే ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా, తమ సినిమా నచ్చకపోతే ఫలానా నెంబర్‌కి కాల్ చేసి ఆ విషయం చెప్పండంటూ ఓ చిత్ర దర్శక నిర్మాతలు ప్రేక్షకులను కోరుతున్నారు. భలే ఉంది కదూ ఈ ప్రొసీజర్. ఇంతకీ ఆ సినిమా పేరేంటనుకుంటున్నారా? 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట'. ఈ సినిమా రేపే విడుదలవుతోంది. సినిమా చిన్నదేనండీ. కానీ చిత్ర యూనిట్ ఆలోచన పెద్దది కదా. క్రియేటివిటీకి కాదేదీ అనర్హం అంటే ఇదే కాబోలు. ఈ సినిమాకి చేస్తున్న వెరైటీ ప్రమోషన్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట' సినిమా గురించి చర్చించుకోవడం జరుగుతోంది. ఓ సినిమాకి ఇంతకన్నా ఉచిత పబ్లిసిటీ ఇంకేముంటుంది? రేపే అంటే మే 26న 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా విడుదలవుతోంది. నాగార్జున ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య హీరో కాగా, చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది అంటే ఈ చిన్న సినిమా 'రారండోయ్'తో పోటీ పడుతుందనడం కరెక్ట్ కాదుగానీ, ఆ సినిమా ముందు ఈ 'శ్రీరాముడింట' సినిమా పబ్లిసిటీ స్టంట్స్ అయితే అదరిపోయాయి. అయితే విజయంలో ఈ పబ్లిసిటీ స్టంట్ ఎంత మేర కలిసొస్తుందో చూడాలిక.