విలక్షణ కథలను ఎంచుకోవడంలో ముందుంటాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయన తాజాగా నటించిన 'నీదీ నాదీ ఒకే కథ' చిత్రం మంచి విజయం అందుకుంది. విజయం సంగతి అటుంచితే, శ్రీవిష్ణు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకునేలా ఉంటాయి. యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. కొన్ని కథలు ఆలోచింపచేస్తాయి. ఈ సారి కూడా అలాంటి సరికొత్త కథతోనే రాబోతున్నాడు శ్రీవిష్ణు.
కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని తాజాగా లాంఛనంగా ప్రారంభించారు. నారా రోహిత్ ఫస్ట్ క్లాప్ కొట్టాడు. నారా రోహిత్, శ్రీ విష్ణు మంచి స్నేహితులు. హీరోలుగా ఇద్దరిదీ ఒకటే దారి. సక్సెస్, ఫెయిల్యూర్స్‌ని అస్సలు పట్టించుకోరు. విలక్షణ నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం మంచి విజయం అందుకుంది. నారా రోహిత్ నటించిన 'అసుర' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడే కృష్ణ విజయ్. శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ స్క్రిప్టు ప్రిపేర్ చేశాడు. ఈ సినిమాతోనూ శ్రీవిష్ణు ప్రశంసలు అందుకుంటాడనీ అంటున్నారు.
ఇటు హీరోగా నటిస్తూనే, మరోవైపు ఇంపార్టెంట్ రోల్స్ కూడా పోషిస్తుంటాడు శ్రీవిష్ణు. నేచురల్ యాక్టింగ్‌తో, తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసే నటుడు శ్రీ విష్ణు. ఏ క్యారెక్టర్ అయినా అందులో పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్రకు జీవం పోస్తాడు.
ఇక తాజా సినిమాకి 'తిప్పరా మీసం' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. టైటిల్‌కి తగ్గట్లుగా శ్రీ విష్ణు గెటప్ కూడా కొత్తగా ఉంది. గుబురు గెడ్డం, మెలి తిరిగిన మీసాలు, పొడుగాటి జుట్టుతో డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నాడు శ్రీ విష్ణు.