'మామ్‌'లో ఎమోషన్‌ అంతకుమించి..

మరిన్ని వార్తలు

అలనాటి అందాల తార శ్రీదేవి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వస్తోన్న చిత్రం 'మామ్‌'. ఇది సినిమా కాదు, జీవితం అంటోంది శ్రీదేవి. ఈ సినిమా ప్రమోషన్స్‌ నిమిత్తం హైద్రాబాద్‌కి విచ్చేసింది అలనాటి అందాల సుందరి శ్రీదేవి. ఈ సందర్భంగా సినిమా గురించి మీడియాతో ముచ్చటించింది. ఈ సినిమాలో తాను పోషించిన పాత్ర నటన కాదు. ఓ ఎమోషన్‌. ఈ ఎమోషన్‌ని ప్రతీ తల్లి అనుభూతి పొందుతుంది. ప్రతీ కుటుంబం ఖచ్చితంగా చూడదగ్గ సినిమా ఇది. ఈ సినిమాలో ఉన్నది ఎమోషన్‌ అంటే ఆ మాట చాలా చిన్నదే అవుతుంది. అలా అని ఆ ఎమోషన్‌ గురించి చెప్పకుండా ఉండలేనని ఆమె అంటోంది. జూలై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని సినిమాగా కాకుండా జీవితంలా ఫీలయ్యి తాను నటించాననీ, అదే ఫీల్‌తో ఆడియన్స్‌ కూడా చూస్తారనీ ఆశిస్తున్నానంటోంది శ్రీదేవి. ఇంతవరకూ శ్రీదేవి హీరోయిన్‌గా ఎన్నో పాత్రల్లో నటించింది. కానీ వాటన్నింటిలోకెల్లా ఈ పాత్ర చాలా స్ట్రాంగ్‌ అంటోంది. టోటల్‌గా తన సినీ కెరీర్‌లోనే ఇదో కలికితురాయిగా మిగిలిపోయే క్యారెక్టర్‌ అని ఆమె చెబుతోంది. తల్లీ, కూతుళ్ల మధ్య అనుబంధాన్ని, భావోద్వేగాల్ని తెలియచెప్పే కాన్సెప్ట్‌ ఇది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా చాలా పక్కాగా జరుగుతున్నాయి. శ్రీదేవి భర్త బోనీకపూర్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకూ శ్రీదేవి అంటే అతిలోక సుందరి మాత్రమే అనుకున్న వారందరూ ఈ సినిమా చూసి శ్రీదేవిలో ఇంత అద్భుతమైన యాంగిల్‌ ఉందా అనుకోకుండా ఉండలేరట. అంత గొప్ప సినిమాగా పరిగణించవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS