అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరనే వార్తని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది 'కల' అయితే బావుండేదని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె మరణవార్త ధృవీకరింపబడినా, పార్తీవదేహానికి సంబంధించి దుబాయ్ నుంచి వెలుగుచూసిన ఓ ఫోటో కన్పిస్తున్నా, 'ఏమో, ఇదంతా అబద్ధమేనేమో' అని భావిస్తున్నవారూ లేకపోలేదు. శ్రీదేవి అంటే అంత అభిమానం వారికి.
ఇంతకీ, శ్రీదేవి ఎలా చనిపోయింది? మరణానికి ముందు ఏం జరిగింది? అని ఆరా తీస్తే, దుబాయ్ మీడియా నుంచి అందుతున్న కథనాల ప్రకారం, వివాహ వేడుకకు హాజరయ్యేందుకు దుబాయ్‌కి వెళ్ళిన శ్రీదేవి కుటుంబం, ఓ హోటల్‌లో బస చేసింది. వివాహ వేడుకలో హుషారుగా పాల్గొన్న శ్రీదేవి, ఆమె భర్త బోనీ కపూర్, హోటల్ రూమ్‌కి తిరిగొచ్చారు. డిన్నర్‌కి వెళ్ళేందుకోసం పిలుపు రాగా, వచ్చిన బంధువులతో సరదాగా మాట్లాడిన శ్రీదేవి, వారు వెళ్ళగానే వాష్‌రూమ్‌కి వెళ్ళింది రిఫ్రెష్ అవడానికి. అంతే, బాత్రూమ్ నుంచి శ్రీదేవి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో డోర్ నాక్ చేసిన బోనీకపూర్‌కి అట్నుంచి రెస్పాన్స్ రాలేదు.
తలుపు తెరచి చూసేసరికి, అచేతనావస్థలో బాత్ టబ్‌లో శ్రీదేవి కనిపించింది. ఊహించని ఈ ఘటనతో షాక్‌కి గురైన బోనీకపూర్, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే శ్రీదేవి మృతి చెందినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లోని చట్టాల నేపథ్యంలో, శ్రీదేవి పార్తీవ దేహం తరలింపు ఆలస్యమవుతోంది. కడసారి చూపు కోసం ముంబైలోని ఆమె ఇంటికి వేలు, లక్షల సంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు. ఈరోజు సాయంత్రానికల్లా శ్రీదేవి పార్తీవ దేహం ముంబైకి చేరుకోనుంది.