స్వయం కృషితో పైకొచ్చిన వాళ్లలో శ్రీకాంత్ ఒకడు. సైడ్ వేషాలు, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరో.. ఇలా అంచెలంచెలుగా ప్రయాణం సాగించాడు. ఒకప్పుడు రొమాంటిక్, ఫ్యామిలీ హీరో అతనే. ఆ తరవాత.. సైడ్ క్యారెక్టర్లకు మారిపోయాడు. అయితే ఈమధ్య శ్రీకాంత్ కెరీర్ మరీ ఘోరంగా తయారైంది. చేతిలో సినిమాల్లేవు. ఉన్నా.. సరిగా ఆడడం లేదు. ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రలు ఎంచుకొంటూ, తన కెరీర్‌ని తనే కిల్ చేసుకొంటున్నాడు.
తాజాగా వారసుడు సినిమాలో నటించాడు శ్రీకాంత్. హీరో విజయ్‌కి సోదరుడిగా నటించాడు. కథలో ఈ పాత్రకు అంత ప్రాధాన్యం ఏం లేదు. పెద్ద సినిమాలో తానూ ఓ భాగమయ్యాడు తప్ప... తనకెరీర్‌కి ఒరిగిందేం లేదు. ఈవారం విడుదలైన హంట్ లోనూ శ్రీకాంత్ నటించాడు. ఏమాత్రం వైవిధ్యం లేని పాత్ర అది. సినిమా కూడా డిజాస్టర్. ఇలా హీరోగా ఛాన్సులు పోయి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న సినిమాలూ పోయి... శ్రీకాంత్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తన చేతిలో శంకర్ సినిమా ఇది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలీదు కానీ, శ్రీకాంత్ కి ఇదే చివరి ఛాన్స్. ఈ పాత్రలో మెప్పిస్తే ఇంకొన్నాళ్లు వెండి తెరపై శ్రీకాంత్ ని చూడగలం. లేకపోతే..ఈ ఇన్నింగ్స్ కి తెర పడినట్టే.