శ్రీకాంత్ నుండి రాబోతున్న మరో 'సంచలన' చిత్రం

మరిన్ని వార్తలు

 శ్రీకాంత్‌, య‌జ్ఞశెట్టి  హీరో హీరోయిన్లుగా  అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై క‌ర‌ణం బాబ్జి ద‌ర్శ‌కత్వంలో అలివేలు నిర్మిస్తున్న చిత్రం `ఆప‌రేష‌న్ 2019`. `బివేర్ ఆఫ్ ప‌బ్లిక్‌`అనేది ట్యాగ్ లైన్‌. ఈ చిత్రం టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. 

ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు టీజ‌ర్ లాంచ్ చేసిన అనంత‌రం మాట్లాడుతూ...``శ్రీకాంత్ నాకు త‌మ్ముడుగా `సింహగ‌ర్జ‌న‌` లో న‌టించాడు. ఆ త‌ర్వాత `నాన్న‌కు పెళ్లి` చిత్రంలో కొడుకుగా న‌టించాడు. త‌ను మంచి న‌టుడే కాదు. మంచి మ‌న‌సున్న వ్య‌క్తి కూడా. గ‌తంలో చేసిన ఆప‌రేష‌న్ దుర్యోధ‌న చిత్రం త‌న‌కు మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు చేస్తోన్న ` ఆప‌రేష‌న్ 2019` టీజ‌ర్ కూడా చాలా బాగుంది.  `బివేర్ ఆఫ్ ప‌బ్లిక్` ఈ  సినిమా క్యాప్ష‌న్ చూసిన త‌ర్వాత నాకు ఓ విష‌యం గుర్తొస్తుంది. 

అదేమిటంటే...నేను కాకినాడ నుంచి మొద‌ట లోక్ స‌భ స‌భ్యుడిగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచాను. ఆ త‌ర్వాత మా సొంతూరైన‌ న‌ర్సాపురం నుంచి పోటీ చేసి మ‌ళ్లీ మెజారిటీతో గెలిచాను. అక్క‌డ నేను చేసిన మంచి ప‌నుల గురించి ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ చెప్పుకుంటుంటారు. కానీ ఆ త‌ర్వాత రాజకీయాల్లోకి వ్యాపార‌వేత్త‌లు ప్ర‌వేశించి ఓట్లు కొన‌డం ప్రారంభించారు. ప‌బ్లిక్ కి కూడా డ‌బ్బుపై ఆశ పెరిగింది. కాబ‌ట్టి ప‌బ్లిక్  తో జాగ్ర‌త్త‌గా ఉండాలి. వారిని మార్చే విధంగా సినిమాలు రావాలి. ఈ సినిమా టీజ‌ర్ చూస్తోంటే ద‌ర్శ‌కుడు ఒక మంచి కాన్సెప్ట్ తో సినిమా తీసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప‌బ్లిక్ ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండ‌బోతుంద‌ని అర్థ‌మవుతోంది.  ఆప‌రేష‌న్ దుర్యోధ‌న చిత్రంలా శ్రీకాంత్ కు ఈ సినిమా మంచి పేరు తేవాల‌నీ, టీమ్ అంద‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా``అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ...``సింహ గ‌ర్జ‌న‌`,  మా నాన్న‌కు పెళ్లి చిత్రాల్లో కృష్ణంరాజు గారితో క‌లిసి న‌టించ‌న ద‌గ్గ‌ర నుంచి వారితో నాకు మంచి అనుబంధం ఏర్ప‌డింది. `ఆప‌రేష‌న్ 2019` టీజ‌ర్ వారి చేతుల మీదుగా విడుద‌ల కావ‌డం చాలా సంతోషం.  గ‌తంలో క‌రణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో మెంట‌ల్ పోలీస్ చేశాను. కానీ టైటిల్ కాంట్ర‌వ‌ర్సీ, రిలీజ్ ప్రాబ్ల‌మ్ వ‌ల్ల ఆ సినిమాకు అనుకున్నంత పేరు రాలేదు.  ఈసారి  కాంట్ర‌వ‌ర్సీ లేకుండా మంచి కంటెంట్ తో సినిమా చేద్దాం అన్నాను. ఈ స్టోరీ చెప్పాడు. ఇందులో కాంట్ర‌వ‌ర్సీ ఉన్నా కంటెంట్ బావుంది. క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.మా నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా నిర్మిస్తున్నారు. ష‌కీల్ ఆరు అద్భుత‌మైన పాట‌లిచ్చారు`` అన్నారు. 

- ప్రెస్ రిలీజ్

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS