నాగార్జున సమర్పణలో వచ్చిన 'నిర్మలా కాన్వెంట్' సినిమా గుర్తుంది కదా. ఆ సినిమాలో నూనూగు మీసాల కుర్రోడిగా నటించాడు హీరో. ఆ హీరో సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకన్న సంగతి తెలిసిందే. పేరు రోషన్ ఇది కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాతో తన కొడుకును హీరోగా తెరంగేట్రం చేయించిన శ్రీకాంత్ ఇప్పుడు కొడుక్కి యాక్టింగ్‌లో ట్రైనింగ్ ఇస్తున్నాడట. తొలి సినిమా ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా, ఫర్వాలేదనిపించాడు రోషన్.
అయితే ఆ సినిమా అనుకోకుండా చేసిన సినిమా అనీ, అప్పటికి రోషన్కింకా సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదనీ శ్రీకాంత్ చెప్పాడు. అయితే ఎప్పటికైనా రోషన్ మంచి హీరో కావాలన్నదే తన కోరిక అని హీరో శ్రీకాంత్ అంటున్నాడు. హీరోయిన్ ఊహ, హీరో శ్రీకాంత్‌ల తనయుడు రోషన్. యాక్టింగ్ అనేది జీన్స్‌లోనే ఉంది. కానీ ఇప్పుడు హీరోగా నిలదొక్కుకోవాలంటే మరింత శిక్షణ అవసరం. అందుకే అందుకు తగిన శిక్షణ తీసుకున్నాకే రోషన్ తదుపరి చిత్రం ఉండనుందనీ శ్రీకాంత్ అంటున్నాడు.
ప్రస్తుతం ఓ పక్క స్టడీస్, మరో పక్క యాక్టింగ్ ట్రైనింగ్‌లో ఉన్న రోషన్, ఈ సారి మంచి కథతో మళ్లీ హీరోగా ఎంట్రీ ఇస్తాడట. మరో వైపు శ్రీకాంత్ తాజాగా 'రా..రా..' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హారర్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఇంతవరకూ శ్రీకాంత్ ట్రై చేయని జోనర్ ఇది. దెయ్యాలను చూసి మనుషులు భయపడడం కామనే. అయితే ఈ సినిమాలో మనుషులను చూసి దెయ్యాలు భయపడతాయి. అదే కొత్త కాన్సెప్ట్. కొత్తగా ఉందనే శ్రీకాంత్ కూడా ట్రై చేశాడు. కానీ ఈ కొత్త ప్రయోగం శ్రీకాంత్‌కి అంతగా వర్కవుట్ అయినట్లుగా లేదు.