ఈ సంక్రాంతి బరిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయితే అందరి దృష్టీ.. 'గుంటూరు కారం'పైనే. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టగల సత్తా.. ఈ సినిమాకి ఉందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ పండక్కి ఎన్ని సినిమాలొచ్చినా, ఫస్ట్ ఆప్షన్ మాత్రం గుంటూరు కారమే. మహేష్ - త్రివిక్రమ్ కాంబోపై ఉన్న అంచనాలు అలాంటివి. అందుకే త్రివిక్రమ్ కూడా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకొంటూ, ఈ సినిమాని ఓ శిల్పంలా చెక్కుతున్నాడు. ఫ్యాన్స్‌కి కావల్సిన అన్ని రకాల హంగులూ ఇందులో ఉండేలా చూసుకొంటున్నాడు.
ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారు. ఈ పాటలో.. మహేష్, శ్రీలీలతో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొనబోతోంది. పూర్ణ స్పెషల్ ఎప్పీరియన్స్ ఇవ్వబోతోంది. మహేష్ నటించిన 'శ్రీమంతుడు'లో 'రాములోరు వచ్చినారురో...' అనే పాటలో పూర్ణ కనిపించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మళ్లీ..మహేష్ సినిమాలో పూర్ణ మెరవబోతోంది. మరో రెండు రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తవుతుంది. దాంతో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్టే. ఆ వెంటనే ప్రమోషన్లు మొదలెడతారు. డిసెంబరు 31న గానీ, జవనరి 1న గానీ ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉంది.