తన సినిమాని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో... రాజమౌళికి బాగా తెలుసు. బాహుబలి సమయంలోనే తన మార్కెటింగ్ నైపుణ్యం వెలుగులోకి వచ్చింది. బాహుబలిలోని పాత్రలతో టాయ్స్, యానిమేటెడ్ గేమ్స్ రూపొందించి మార్కెటింగ్ చేశాడు. అది తన సినిమా ప్రమోషన్లకు బాగా ఉపయోగపడింది. బాహుబలి ఫ్రాంచైజీని ఏదో రూపంలో వాడుకోవాలన్నది రాజమౌళి ప్లాన్. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ విషయంలోనూ అదే చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్‌తో మరో పాన్ ఇండియా హిట్టు కొట్టాడు రాజమౌళి. ఆ టైటిన్ ని ఇప్పుడు బ్రాండ్ గా మార్చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్.
ఆర్.ఆర్.ఆర్ పేరుతో రెస్టారెంట్లని ప్రారంభించాలన్నది రాజమౌళి ఆలోచన. ఈ వ్యాపారంలో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో పాటుగా ఆ చిత్ర నిర్మాత డి.వి.వి దానయ్య కూడా భాగస్వామిగా ఉంటార్ట. దేశ వ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో ఈ రెస్టారెంట్లని ప్రారంభించాలన్న ఆలోచన ఉంది. ముందుగా హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలో రెస్టారెంట్లు ప్రారంభిస్తారు. దానికి వచ్చిన స్పందన ని చూసి, మిగిలిన చోట్ల కూడా బ్రాంచీలు ఓపెన్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ ఆలోచన ప్రాధమిక దశలోనే ఉంది. రెస్టారెంట్ పరిస్థితి ఎలా ఉంది? ఈ వ్యాపారంలో ఉన్న సాధక బాధకాలేంటి? అనే విషయంలో రాజమౌళి టీమ్ ప్రస్తుతం రీసెర్చ్ చేస్తోందని టాక్. ఆ రిపోర్టు పాజిటీవ్‌గా వస్తే... ఆర్.ఆర్.ఆర్ రెస్టారెంట్స్ చూసేయొచ్చు.