సంక్రాంతి సీజన్‌లో వచ్చే సినిమాల గురించే టాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఓ వైపు ఆర్.ఆర్.ఆర్.. మరోవైపు రాధే శ్యామ్ విడుదలకు సిద్ధమయ్యాయి. మధ్యలో భీమ్లా నాయక్ కూడా నేనున్నా అంటున్నాడు. భీమ్లా తోనే అసలు సమస్య. రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్ రెండూ... పాన్ ఇండియా సినిమాలు. వాటికి సంక్రాంతికి రావడం అత్యవసరం. ఈ మధ్యలో మూడో సినిమా వస్తే... వసూళ్లకు గండి పడుతుంది. అందుకే భీమ్లా నాయక్ ని ఆపాలని చూస్తున్నారు.
మరోవైపు భీమ్లా నాయక్ కూడా సంక్రాంతికే రావాలని పట్టుబడుతున్నాడు. ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వెనకడుగు వేసేదే లేదంటున్నాడు. ఈ విషయమై చిరంజీవి రంగంలోకి దిగి పవన్ కి సర్ది చెప్పాలని చూశారని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు ఆఖరి ప్రయత్నంగా రాజమౌళి ఎంట్రీ ఇస్తున్నాడట. రాజమౌళి పవన్ ని కలిసి, పరిస్థితిని వివరించే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. ఒకట్రెండు రోజుల్లో రాజమౌళి, పవన్‌ల మధ్య భేటీ జరగబోతోందని టాక్. పవన్ అప్పాయింట్ మెంట్ కోసం రాజమౌళి ప్రయత్నిస్తున్నారని, ఏ క్షణంలోనైనా పవన్ నుంచి పిలుపు రావొచ్చని సమాచారం. మరోవైపు `ఆర్.ఆర్.ఆర్` పబ్లిసిటీ కోసం కూడా పవన్‌ని ఆహ్వానించే ఛాన్స్ వుంది. ఇటీవల ముంబై వెళ్లిన రాజమౌళి సల్మాన్ ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్‌ని సైతం ఆర్.ఆర్.ఆర్ వేడుకకు ఆహ్వానించే అవకాశం ఉంది.