తమన్ మంచి ఫామ్ లో వున్నాడు. పాటలు, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్కు అదరగొడుతున్నాడు. అంతేకాదు..పాటలతో పాటు మాటలు కూడా తెగ ఆడుతున్నాడు. కొన్నిసార్లు కంట్రోల్ కూడా తప్పుతున్నాడు. రాధేశ్యామ్ విడుదల తర్వాత ప్రభాస్, పూజా ఎక్కడా కనిపించడం లేదు. తమన్ ని తోడు తీసుకొని దర్శకుడే టూర్లు వేస్తున్నాడు. అయితే ఈవెంట్ లో దర్శకుడు కంటే తమనే ఎక్కువ మాట్లాడుతున్నాడు. దర్శకుడు చెప్పాల్సిన సమాధానాలు కూడా తమనే చెప్పేస్తున్నాడు. తాజాగా ఓ కాలేజ్ కి వెళ్లారు. అక్కడ ఓ అమ్మాయి 'రాధేశ్యామ్ లో ఎవరి పాత్ర నచ్చింది ?' అని అడిగితే .. పూజ హెగ్డే అని చెప్పాడు. అక్కడితో ఆగలేదు. ''ఎవరైనా ముద్దుముద్దుగా మాట్లాడతారు. కానీ పూజా మాత్రం ముద్దముద్ద మాట్లాడుతుంది. ఆమె ముద్దముద్ద తెలుగు డైలాగులు చెబుతుంటే భలే అనిపించింది. పూజని తన స్టయిల్ లోనే ముద్దముద్దగా మాట్లాడుతూ ఇమిటేట్ చేస్తా'' అని స్టేజ్ పై వెకిలిగా నవ్వాడు తమన్.
ఇదేదో పెద్ద జోక్ అనుకున్నాడు కానీ.. తమన్ మాటలు విన్న వాళ్ళు మాత్రం .. అదేం వెలికి నవ్వు అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు తమన్ కామెంట్లు పూజా పరువు తీసినట్లయింది. రాధే శ్యామ్ లో పూజా డబ్బింగ్ పై కొన్ని కంప్లైంట్స్ వున్నాయి. ఆమె ఇష్టపడి డబ్బింగ్ చెబుతుంది కానీ అది వినడానికి కొంచెం కష్టంగా వుంది. పదాలు అరువు తెచ్చుకున్నట్లు, గొంతులో ఏదో అడ్డం వున్నట్లు చెబుతుంది. ఏవో పాటలకి ముందు వచ్చే కమర్షియల్ సినిమాల్లో నడిచిపోయింది కానీ రాధే శ్యామ్ లో ఆమె పాత్ర నిడివి ఎక్కువ వుండటం చేత.. డబ్బింగ్ లో చాలా చోట్ల ఇబ్బంది పడిపోయింది. చాలా ఎమోషన్లు ఆ వాయిస్ లో పలకలేదు. పైగా డైలాగు ని ఇంగ్లీష్ లో రాసుకొని చదువుతుందనే సంగతి ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు ఏకంగా ముద్దముద్ద మాటలంటూ పూజా గాలి తీసేశాడు తమన్.