మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటి వరకూ రెండు సినిమాలొచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈనెల 31న కృష్ణ జన్మదినం. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఓ కీలకమైన అప్ డేట్ ఇవ్వబోతోంది చిత్రబృందం. ఆ రోజున టైటిల్ ప్రకటిస్తారని సమాచారం అందుతోంది. అదే రోజున హీరోయిన్ నీ ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లుంటారని టాక్.
ఓ కథానాయికగా పూజా హెగ్డే దాదాపుగా ఖాయం అయిపోయిందట. మరో హీరోయిన్ గా నివేదా థామస్ ని తీసుకున్నారని తెలుస్తోంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటిస్తుందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తన పేరు కూడా దాదాపుగా ఖాయమని సమాచారం. అంటే..ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లన్నమాట. అతడు, ఖలేజాలో.. ఒకొక్కరే హీరోయిన్. ఇది హ్యాట్రిక్ సినిమా కదా. అందుకే ఏకంగా ముగ్గురు హీరోయిన్లని రంగంలోకి దింపేస్తున్నాడన్నమాట.