మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే షూటింగ్ దశలో ఉండగానే ఓటీటీ బిజినెస్ క్లోజ్ అయ్యింది. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.81 కోట్లకు కొనుగోలు చేసింది. ఓ తెలుగు సినిమాకి దక్కిన... అత్యధిక ఓటీటీ రేటు ఇది. అలాగని... థియేటర్లో వచ్చిన మూడు వారాలకో, నాలుగు వారాలకో.. ఓటీటీలోకి వెళ్లిపోవడం లేదు.
కనీసం 50 రోజులు ఆగాలి. ఆ తరవాతే ఓటీటీలోకి వస్తుంది. ఈ విషయమై నెట్ ఫ్లిక్స్‌కీ, నిర్మాతలకూ స్పష్టమైన ఒప్పందం జరిగింది. సినిమా విడుదలయ్యాక.. 50 రోజుల తరవాతే ఓటీటీకి ఇవ్వాలని ఇటీవల చిత్రసీమ ఓ కీలకమైన నిర్ణయం తీసుకొంది. కానీ... దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కొన్ని సినిమాలు మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇంకొన్ని నెల రోజులకు ప్రత్యక్షం అవుతున్నాయి. మహేష్ బాబు లాంటి బడా స్టార్ సినిమాని... 50 రోజుల షరతుపై ఓటీటీకి ఇవ్వడం శుభపరిణామం. ప్రస్తుతం హైదరాబాద్ లో మహేష్ - త్రివిక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. సారధి స్టూడియోలో వేసిన భారీ సెట్లో.. కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.