ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. అదే కోవిడ్-19. ఏదో ఒక రూపంలో దీని ప్రస్తావన లేకుండా ఎవరికీ రోజు గడవడం లేదు. కొందరు ఈ సమస్యను ఎదుర్కొనడానికి మానసికంగా ధైర్యంగా ఉన్నారు కానీ కొందరు మాత్రం నిరాశకు లోనవుతున్నారు. ఇలాంటి వారికి నిరుత్సాహం తొలగించేందుకు, ప్రేరణనిచ్చేందుకు ఆస్కార్ అవార్డు కమిటీ వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య వారు ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోలో ఆస్కార్ అవార్డులకు నామినేషన్లు సాధించిన సినిమాలనుంచి ఆశావహ దృక్పథం పెంచుతూ, ప్రేరణనిచ్చే డైలాగులను, సన్నివేశాలను తీసుకొని వాటన్నింటిని కలిపి ఒక వీడియోగా చేశారు. ఇందులో దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించిన 'లైఫ్ ఆఫ్ పై' సినిమాలోని ఒక డైలాగ్ ను కూడా జోడించడం విశేషం. ఇర్ఫాన్ ఖాన్ ఎన్నో హిందీ చిత్రాలతోపాటు కొన్ని హాలీవుడ్ సినిమాలలో కూడా నటించారు. అందులో ఒక చిత్రం 'లైఫ్ ఆఫ్ పై'. ఇలా అకాడమీ అవార్డు వారు ఇర్ఫాన్ ఖాన్ నటించిన సినిమాలోని డైలాగును కూడా జోడించడం ఇర్ఫాన్ ఖాన్ కు ఇచ్చిన గౌరవం లాగా అభిమానులు భావిస్తున్నారు. ఇర్ఫాన్ ఖాన్ కొంతకాలం కాన్సర్ తో పోరాడి ఈ ఏడాది ఏప్రిల్ లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
A celebration of hope—through the lens of movies we love. pic.twitter.com/EYZ5FPvHdl
— The Academy (@TheAcademy) July 29, 2020