మలయాళ సూపర్ హిట్ చిత్రం `అయ్యప్పయుమ్ కోషియమ్`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే పవన్ కల్యాణ్ ఈ రీమేక్‌లో ఎంట్రీ ఇచ్చాడో.. అప్పుడే ఈ సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రెండో కథానాయకుడిగా రానా పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ.. ఎందుకైనా మంచిదని రకరకాల ఆప్షన్లు ప్రయత్నిస్తోంది చిత్రబృందం.
తమిళ స్టార్ విజయ్‌సేతుపతి పేరు ప్రముఖంగా ఈ రీమేక్ కోసం వినిపిస్తోంది. పవన్, విజయ్ సేతుపతి అయితే.. ఈ కాంబో అదిరిపోతుంది. అయితే... విజయ్ సేతుపతి మహా బిజీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు సినిమాలకు అంతగా సమయం కేటాయించకపోవొచ్చు. అందుకే మరో ఆప్షన్ గా సుదీప్ పేరు పరిశీలిస్తోంది. సుదీప్ కన్నడలో సూపర్ స్టార్. తాను ఓకే అంటే ఈ సినిమాకి కన్నడలోనూ మార్కెట్ మొదలైపోతుంది. అయితే... తొలి ఆప్షన్ మాత్రం రానానే. తనకు వీలు కాని పక్షంలో విజయ్, సుదీప్ ల పేర్లు పరిశీలిస్తారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.