జీవితంలో ఆటుపోట్లు - అవమానాలు అతి సహజం. సినీ పరిశ్రమలో అయితే మరీనూ. వాటిని ఓర్చుకుంటూ, నిలిచినవాళ్లే గెలుస్తాయి. యంగ్ హీరో సుధీర్ బాబుకీ అలాంటి అవమానాలు ఎదురయ్యాయి. అయినా సరే, తట్టుకుని నిలబడ్డాడు. ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు.
సుధీర్ బాబు తొలి సినిమా `ఎస్.ఎం.ఎస్`. ఆ సినిమాని చాలా కష్టపడి పట్టాలెక్కించారు. తొలి రోజు.. షూటింగ్‌లో, కాస్త బ్రేక్ తీసుకున్నాక... `వీడేం ఆర్టిస్టు.. ఫొటోజెనిక్ ఫేస్ ఏమాత్రం కాదు` అని ఓ కెమెరామెన్ అంటుంటే.. చాటుగా విన్నాడట సుధీర్. దాంతో చాలా బాధ పడ్డాడట. ఓ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేశాడట. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల, ఎలాగైనా సినిమా పూర్తి చేయడం తప్ప, మరో ఆప్షన్ లేకపోవడంతో... ఆ బాధని, అవమానాన్ని దిగమింగుకుని సినిమాని పూర్తి చేశాడట సుధీర్. అయితే మధ్యలో ఆ కెమెరామెన్‌ని పనిలోంచి తీసేశాడట. ``ఆ రోజు చాలా బాధ పడ్డాను. ఫొటో జెనిక్ ఫేస్ కాదు అనేసరికి ఏం చేయాలో తెలీలేదు. కేవలం నటనతోనే మెప్పించగలను అనిపించి, దానిపై దృష్టి పెట్టా. ఆ కెమెరామెన్‌ని తొలగించాను కానీ, రెండు మూడు సినిమాల తరవాత తనని పిలిచి మళ్లీ అవకాశం ఇచ్చా.. మనల్ని వెనక్కి లాగేవాళ్లు ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు. కానీ మనం ఏమిటో మనకే తెలుసు. మన ప్రతిభ మనకే అర్థం అవుతుంది`` అని తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చాడు సుధీర్ బాబు.