యంగ్ హీరో అనడం కన్నా, విలక్షణ నటుడు అనడం సబబేమో. ఎందుకంటే సుధీర్‌బాబు చేసే సినిమాలు అలాంటివి. ఇటీవల నిర్మాతగా మారి 'నన్ను దోచుకుందవటే' సినిమాని నిర్మించాడు. తొలి సినిమా నుండి ఇప్పటి దాకా రొటీన్‌కి భిన్నంగానే వెళుతున్నాడు. చేసే ప్రతీ సినిమా కొత్తదనంతో కూడినదే ఉండాలనే కసితో కథల్ని ఎంపిక చేసుకుంటున్న సుధీర్‌బాబు నుండి 'వీరభోగ వసంతరాయలు' సినిమా రాబోతోంది.
ఇందులో అతనొక్కడే హీరో కాదు. సినిమాలో నాలుగు ముఖ్యమైన పాత్రలున్నాయి. అందులో సుధీర్‌ది ఓ పాత్ర. అయితే ఈ పాత్రకు సుధీర్‌బాబు డబ్బింగ్ చెప్పుకోలేదు. ట్రైలర్ రావడంతోనే సుధీర్‌బాబు అభిమానులు షాక్ తిన్నారు. 'ఎందుకిలా చేశావ్ సుధీర్..'? అని చాలా మంది ప్రశ్నించేశారు. ఈ ప్రశ్నలు వస్తాయని ముందే ప్రిపేర్ అయ్యాడేమో సుధీర్‌బాబు.
సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. వాయిస్ తనది కాదని ప్రత్యేక కారణాల వల్ల తన పాత్రకు వేరే వ్యక్తి డబ్బింగ్ చెప్పాడనీ వివరణ ఇచ్చాడు. ఈ వివరణతో అతని అభిమానులు సంతృప్తి చెందలేదు. 'ఎందుకిలా చేశావ్..'? అని ప్రేమతో ప్రశ్నిస్తున్నారు. ట్రైలర్ ఎలా ఉన్నా సరిపెట్టుకుంటాం కానీ, సినిమాలో మాత్రం అలా చేయొద్దు.. ప్లీజ్ అని బతిమాలుకుంటున్నారు.
ఇంతకీ ఏ ప్రత్యేక కారణాల వల్ల సుధీర్‌బాబు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పలేదో తెలియరాలేదు. ఆ టాప్ సీక్రెట్ సుధీర్‌బాబు ఎప్పుడు రివీల్ చేస్తాడో వేచి చూడాలి. ఈ సినిమాలో నారా రోహిత్, శ్రియ, శ్రీవిష్ణు మిగతా ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు.