జబర్‌దస్త్ తో... తనకంటూ ఓ పాపులారిటీ సంపాదించుకొన్నాడు సుడిగాలి సుధీర్. అడపా దడపా... వెండి తెరపై కూడా మెరుస్తున్నాడు. తను హీరోగా చేసిన `గాలోడు` శుక్రవారం విడుదలైంది. సుధీర్ సినిమానే కదా.. అని చాలామంది దీన్ని పట్టించుకోలేదు. పైగా ఈ శుక్రవారం చాలా సినిమాలు విడుదలయ్యాయి. గుంపులో గోవిందలా.. `గాలోడు` మిగిలిపోతుందని అనుకొన్నారు. కానీ అందరి అంచనాలనూ.. ఈ సినిమా తారు మారు చేసింది. తొలి రోజు బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టుకొంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ సినిమాకి దాదాపు రూ.కోటి వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విశాఖలో ఈ సినిమాని రూ.40 లక్షలకు కొన్నారు. తొలి రోజే.. రూ.20 లక్షలు వచ్చేసినట్టు తెలుస్తోంది. నైజాంలో దాదాపుగా రూ.25 లక్షలు వసూలు చేసినట్టు టాక్. సుడిగాలి సుధీర్ సినిమాకి ఇవి నిజంగా ఆకర్షణీయమైన వసూళ్లే.
ఇటీవలే...అల్లు శిరీష్ సినిమా `ఊర్వశివో రాక్షసివో` విడుదలైంది. తొలి రోజు నైజాంలోని ఓ థియేటర్లో అన్ని షోలకూ కలిపి రూ.20 వేలు సాధిస్తే... సుడిగాలి సుధీర్ సినిమా తొలి రోజు... అదే థియేటర్లో ఒకే ఆటకు రూ.20 వేలు తెచ్చుకొందట. ఈ లెక్కన శిరీష్ కంటే.. సుడిగాలి సుధీర్‌కే ఎక్కువ క్రేజ్ ఉన్నట్టు రుజవవుతోంది. ఈసినిమాకి దాదాపుగా రూ.4 కోట్లు ఖర్చయినట్టు టాక్. తొలి రోజు... కోటి వచ్చిందంటే.. ఈ సినిమా సేఫ్ జోన్‌లో పడిపోయినట్టే.