ఇది బయోపిక్ ల కాలం. సెలబ్రెటీల జీవితాలు వెండి తెరపైకి వచ్చేస్తున్నాయి. సినీ తారల లైఫ్ గురించి తెలుసుకోవడం అంటే అందరికీ ఆసక్తే. అందుకే తారల కథలకు మరింత డిమాండ్ ఉంటుంది. ఈ కోవలో సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ కూడా రాబోతోందన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.
దాదాపు 350 చిత్రాల్లో నటించి, దశాబ్దాల పాటు ప్రేక్షకులకు వినోదం పంచిన నటుడు కృష్ణ. ఓ సామాన్యుడు సూపర్ స్టార్ అవ్వడం నిజంగా గ్రేటే. కృష్ణ జీవితం ఏమీ పూల పాన్పు కాదు. అందులోనూ ముళ్లున్నాయి. ఎత్తు, పల్లాలు ఉన్నాయి. గెలుపు, ఓటమిలు ఉన్నాయి.
ఇండస్ట్రీని ఏలిన కృష్ణ... సూపర్ ప్లాపులతో.. దివాళా తీసే స్థాయికీ చేరుకొన్నారు. అక్కడి నుంచి మళ్లీ నిలదొక్కుకోగలిగారు. ఎన్టీఆర్ తో ఎంత స్నేహం ఉందో.. అంతే వైరం ఉంది. తన వైవాహిక జీవితంలోనూ మలుపులున్నాయి. ఇవన్నీ బయోపిక్‌కి అక్కరకు వచ్చేవే. మహేష్ కూడా ఓ సందర్భంలో `నాన్నగారి బయోపిక్ చేస్తానంటే నేను నిర్మాతగా ఉంటా` అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. మరి... కృష్ణ బయోపిక్ చేయాలంటే... దమ్మున్న దర్శకుడు కావాలి. అంతే కాదు.. కృష్ణలాంటి నటుడ్ని వెదికి పట్టుకోవాలి. ఇవి రెండూ కష్టమే. దర్శకుడు దొరికితే.... హీరో కావాలి. దర్శకుడు కాస్త ఈజీగా దొరికినా.. హీరోని పట్టుకురావడం మామూలు విషయం కాదు. హీరో దొరికితే.. ఈ బయోపిక్ కల నెరవేరినట్టే.