పుష్ప 1 సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఇప్పుడు అందరి చూపూ.. పుష్ప 2పైనే ఉంది. జనవరిలోనే ఈ సినిమా మొదలవుతుందనుకున్నారు. కానీ కుదర్లేదు. ఏప్రిల్ లేదా మేలో స్టార్ అవుతుందనుకున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేటూ లేదు. ఇప్పుడు జూన్‌కి గానీ ఈసినిమా సెట్స్ పైకి వెళ్లదని క్లారిటీ వచ్చింది. మరోవైపు ఈ సినిమా బడ్జెట్ కూడా రెండింతలు పెరిగిందన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. పుష్ప పార్ట్ 1.. 250 కోట్లలో పూర్తయ్యింది. నార్త్ బెల్ట్ లో ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చాయి. దాంతో.. పెట్టుబడి తిరిగి రాబట్టుకోగలిగింది. ఇప్పుడు పుష్ప 2 బడ్జెట్ దాదాపు 400 కోట్లని తెలుస్తోంది. ఇది నిజంగా.. మైత్రీ మూవీస్‌కి పెద్ద షాకే.
పుష్ప 1 సూపర్ హిట్ అవ్వడంతో.. పుష్ప 2 పై అంచనాలు పెరుగుతాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని కథలో కీలకమైన మార్పులు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌కి పెద్ద పీట వేశాడట. అవన్నీ భారీ స్థాయిలో తీయాల్సివస్తోందని, అందుకే బడ్జెట్ పెరిగిందని సమాచారం. పైగా పుష్ప 1 కీ.. పుష్ప 2కీ అల్లు అర్జున్, సుకుమార్ పారితోషికాల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అవన్నీ నిర్మాతలు భరించాల్సిందే. ఓ తెలుగు సినిమా పెట్టుబడి రూ.400 కోట్లంటే మాటలు కాదు. ఆర్.ఆర్.ఆర్‌కి దాదాపుగా 500 కోట్లయ్యింది. ఇద్దరు హీరోల సినిమా, పైగా రాజమౌళి బ్రాండ్ వల్ల.. రూ.1000 కోట్లు సాధించింది. అందులో సగం వచ్చినా... పుష్ప 2 లాభాలు కొట్టొచ్చు. ఆ ప్లానింగ్ తోనే.. పుష్ప 2 బడ్జెట్ పెంచేసినట్టు వినికిడి.