ఇది వరకు దాసరి, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ లాంటి దిగ్గజాల నుంచి బోలెడంత మంది శిష్యగణం వచ్చేది. వాళ్లూ సినిమాలు తీసి, హిట్లు కొట్టి, గురువుకి తగిన శిష్యులు అనిపించుకునేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం మారింది. ఎవరి దగ్గరా పనిచేయకుండానే నేరుగా దర్శకులు అయిపోతున్నారు. పెద్ద దర్శకులు సైతం.. శిష్యుల్ని ప్రమోట్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ.. సుకుమార్ అలా కాదు. తన శిష్యుల్ని బాగా ప్రోత్సహిస్తున్నాడు. తన బ్యానర్‌లో శిష్యుల కోసం సినిమాలు చేస్తున్నాడు. శిష్యుల సినిమాల్ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు.
ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో `ఉప్పెన` రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాని తెర వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ సుకుమారే. ప్రస్తుతం ఎడిటింగ్ పనుల్లో ఉన్నాడట సుకుమార్. ఈ సినిమాని పర్‌ఫెక్ట్ గా కట్ చేసే పనిలో నిమగ్నమయ్యాడట. ఉప్పెన బజ్ కూడా బాగుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు సుక్కు. అంతేకాదు... బుచ్చిబాబు రెండో సినిమా కోసం కూడా తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశాడని చెబుతున్నారు. రామ్ చరణ్ కోసం బుచ్చిబాబు ఓ కథ తయారు చేశాడని ఇండ్రస్ట్రీ వర్గాల్లో టాక్. అసలు వీరిద్దరి కాంబో సెట్ చేయడానికి ప్రధాన కారణం సుకుమారే అని తెలుస్తోంది. బుచ్చిని చరణ్‌కి పరిచయం చేసింది, కథ చెప్పించింది కూడా సుకుమారేనట. దాంతో చరణ్ కూడా ఈ ప్రాజెక్టు చేయడానికి సముఖత వ్యక్తం చేసినట్టు టాక్. తొలి సినిమా విడుదల కాకముందే స్టార్లని పట్టుకోగలుగుతున్నాడంటే దాని వెనుక... సుకుమార్ కృషిని అర్థం చేసుకోవాల్సిందే. మున్ముందు సుకుమార్ శిష్యుడు ఇంకెన్ని మెగా ఆఫర్లు అందుకుంటాడో చూడాలి.