అక్కినేని ఇంటి నుంచి వచ్చిన సుమంత్ కెరీర్ ముందు నుంచీ కొంత సందిగ్థావస్థలోనే ఉన్న మాట వాస్తవం. క్లాస్ సినిమాలు చేయాలా? మాస్ సినిమాలు చేయాలా? అనేది తెలియక చాలా కాలం అటూ ఇటూ ఊగిసలాడాడు. అందులోంచి తేరుకోగానే కెరీర్ సగం అయిపోయింది. ఆ తరవాత కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఎంచుకుంటూ వెళ్లాడు. అక్కడ ఒకట్రెండు మంచి ఫలితాలు వచ్చినా.. మళ్లీ బ్యాక్ టూ పెవీలియన్ అనుకొనే పరిస్థితి వచ్చింది. కొంతకాలంగా అసలు సుమంత్ గురించి తెలుగు ప్రేక్షకులు ఆలోచించడమే మానేశారు. సుమంత్ కూడా సినిమాల్ని మరింత లైట్ తీసుకొన్నాడు. ఇప్పుడు సడన్ గా `సీతారామం`లో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.
`సీతారామంలో సుమంత్ కూడా ఉన్నాడు` అనే విషయం తెలిసి... ఎవరూ పెద్దగా ఉత్సాహపడిపోలేదు. కానీ... బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ లుక్ చూడగానే... అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఎప్పుడూ సుమంత్ ని ఈ కోణంలో చూడకపోవడం వల్ల ఇంకాస్త షాకింగ్ గా అనిపించింది. `సీతారామం` కథకు సుమంత్ ఎంత ప్లస్ అవుతాడో ఇప్పుడే చెప్పలేం గానీ, ఈ సినిమా మాత్రం సుమంత్ కెరీర్‌కు టర్నింగ్ పాయింటే. ఎందుకంటే.. హీరోగా చేద్దామంటే, బయట పోటీ మామూలుగా లేదు. తన శైలికి, స్థాయికి, మార్కెట్ కి తగిన కథలా అందుబాటులో లేవు. అలాంటప్పుడు కథని మలుపు తిప్పే కీలక పాత్రలు ఎంచుకొంటూ వెళ్తే... సుమంత్‌కి తిరుగు ఉండదు. దానికి `సీతారామం` తొలి మెట్టు అయ్యే అకాశం ఉంది.
'సీతారామం'లో సుమంత్ లుక్ బయటకు రాగానే... చిత్రసీమ కూడా సుమంత్ వైపు దృష్టిసారించడం మొదలెట్టింది. 'సుమంత్‌లో ఈ కోణం కూడా ఉందా? ఇలాక్కూడా సుమంత్ ని వాడుకోవచ్చా' అని ఆలోచించడం మొదలెట్టింది. లుక్ అలా వచ్చిందో లేదో... అప్పుడే రెండు ఆఫర్లు సుమంత్ ని వెదుక్కొంటూ వెళ్లినట్టు సమాచారం. అందులో ఓ పెద్ద బ్యానర్ సినిమా కూడా ఉంది. కేవలం లుక్ తోనే.. రెండు ఆఫర్లు సంపాదించేశాడంటే.. సినిమా బయటకు వస్తే, అందులో సుమంత్ పాత్ర క్లిక్ అయితే... ఆ వ్యవహారం వేరేలా ఉంటుంది.
'సీతారామం' కోసం వైజయంతీ మూవీస్ పాటిస్తున్న స్ట్రాటజీ ముందు నుంచీ ఓ ప్లాన్ ప్రకారమే నడుస్తోంది. ఈ సినిమాలో ముందు నుంచీ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మికల బొమ్మలే పోస్టర్లపై కనిపిస్తున్నాయి. అయితే... లోలోపల చాలామంది స్టార్లున్నారు. వాళ్లని ఒకొక్కరుగా రివీల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ముందు సుమంత్ పాత్రని రివీల్ చేశారు. ఆ తరవాత తరుణ్ భాస్కర్ కూడా ఉన్నాడని చెప్పి షాక్ ఇచ్చారు. ఆ తరవాత.. గౌతమ్ మీనన్ ని తీసుకొచ్చి సర్‌ప్రైజ్ చేశారు. మున్ముందు ఇంకొన్ని పాత్రల్ని పరిచయం చేసి...ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
''చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి'' అనేది సామెత. దాన్ని అక్షరాలా పాటిస్తోంది వైజయంతీ మూవీస్. ఈ సినిమాలో ప్రతీ పాత్రకూ... పేరున్న నటీనటుల్ని ఎంచుకొని.. `సీతారామం` రేంజ్ పెంచుకుంటూ పోతున్నారు. సౌతిండియాలోని అన్ని భాషల్లోనూ విడుదలయ్యే సినిమా ఇది. కాబట్టి.. ఈ మాత్రం కేరింగ్ తప్పనిసరి. మొత్తానికి `సీతారామం`ని స్టార్లతో నింపేస్తోంది వైజయంతీ మూవీస్. ఈ వెలుగులు వెండి తెరపై కూడా పాస్ అయితే.. ఈ సినిమా కూడా పాసైపోయినట్టే..!