స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆయా పాత్రల కోసం ఆయా నటీనటులు తమని తాము మేకోవర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం అక్కినేని మనవడు సిద్ధమయ్యాడు. ఇంతకీ అక్కినేని మనవడు అంటే చైతూనో, అఖిల్‌నో కాదండీ. సుమంత్. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ పాత్ర పోషస్తోంది చైతూ కాదు, సుమంత్. అక్కినేని నాగేశ్వరరావుగారికి ఆయన కూతురు కొడుకు అయిన సుమంత్‌కు మధ్య ఎక్కువ ఎటాచ్‌మెంట్ ఉందన్న సంగతి ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులకు తెలిసిందే. అందుకే చిత్ర యూనిట్ ఆయన పాత్ర కోసం సుమంత్ అయితే సరైన ఎంపికగా భావించారు. ఆయన్నే ఈ పాత్ర కోసం ఎంచుకున్నారు.
లేటెస్టుగా ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. తొలిరోజు షూటింగ్ కోసం సుమంత్ తాత అక్కినేని నాగేశ్వరరావు చివరి సారిగా వాడిన కారును ఉపయోగించారు. ఆ కారులో షూటింగ్‌కు బయలుదేరుతూ, దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు సుమంత్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రను రానా దగ్గుబాటి పోషిస్తున్నారు.
ఇటీవలే చంద్రబాబు పాత్రలో రానా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తోంది.