ఈ రోజుల్లో చిన్న సినిమానైనా సరే, పెద్ద పబ్లిసిటీతో హోరెత్తించాలి. లేదంటే జనాలకు ఆనడం లేదు. అసలే కరోనా భయాలతో సతమతమవుతున్నారు. థియేటర్లకు వెళ్లాలా, వద్దా? అనే సందేహాలు ఇంకా తొలగిపోలేదు. వాళ్లని థియేటర్లకు రప్పించాలంటే ప్రమోషన్లు భారీగా చేయాల్సిందే. ఆ ప్రమోషన్లు లేక ఓ సినిమా విలవిలలాడిపోతోంది. అదే.. `కనబడుటలేదు`.
సునీల్ హీరోగా నటించిన సినిమా ఇది. ఈనెల 13న విడుదల అవుతోంది. ఈవారం సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మినిమం అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమోషన్లు గట్టిగా జరగాలి. కానీ.. ఈ సినిమాకి ప్రమోషన్లు కనిపించడం లేదు. మరోవైపు `పాగల్` ప్రమోషన్లలో టాప్ లో ఉంది. ఆ సినిమాని తట్టుకొని నిలబడాలంటే.. కాస్తో కూస్తో ప్రమోషన్లకు ఖర్చు పెట్టాలి. కానీ నిర్మాతలు పైసలు తీయడం లేదు. ఈ విషయంలో సునీల్ నిర్మాతలపై గుర్రుగా ఉన్నాడని టాక్. హీరోగా డౌన్ ఫాల్ మొదలయ్యాక... కామెడీ పాత్రలవైపు మొగ్గు చూపించడం మొదలెట్టాడు సునీల్. మధ్యమధ్యలో ఒకట్రెండు సినిమాల్లో హీరోగా మెరవాలని నిర్ణయించుకున్నాడు. అలాంటప్పుడు తన సినిమాలకు ప్రమోషన్లు లేకపోతే ఎలా? అందుకే ఈ వ్యవహారంలో సునీల్ సీరియస్ గా ఉన్నాడని టాక్.