అన్ని మంచి సినిమాలూ మౌత్ టాక్‌తో ఆడేయవు. వాటికి పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ రివ్యూల రూపంలో అయితే ఆ ప్రత్యేకమైన సినిమాలకు ఇంకా ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. 'పెళ్ళిచూపులు', 'ఘాజీ' అలాంటి సినిమాలేనని ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు అభిప్రాయపడ్డారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. సినిమా విడుదలైన వెంటనే రివ్యూలు రాయడం సబబు కాదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలతో రివ్యూలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువమంది రివ్యూలను సమర్థిస్తున్నారు. ఈ రోజుల్లో రివ్యూలను ఆపాలనుకోవడం అంత తేలిక కాదు. ఇంటర్నెట్‌లో ఆంక్షలు అనేది దాదాపు అసాధ్యం. సోషల్ మీడియా వచ్చాక ఏ సినిమాకి సంబంధించిన అభిప్రాయమైనా రివ్యూ రూపంలో క్షణాల్లో ప్రపంచమంతా తిరిగేస్తోంది. కాబట్టి రివ్యూలలో ఉండే చిన్న చిన్న నెగెటివ్స్ గురించి ఆలోచించకుండా ఎక్కువగా కనిపించే ప్లస్ పాయింట్స్ మీదనే దృష్టిపెట్టడం మంచిది. పెద్ద సినిమాల నడుమ చిన్న సినిమాలు ఒక్కోసారి కిల్ అయిపోతాయి. అలాంటివి జరగకుండా రివ్యూలు ఆ చిన్న సినిమాల్ని ఆదుకుంటాయి. అలాగని చెప్పడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. రివ్యూ అంటే సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. కాబట్టి, రివ్యూలను మూడు రోజుల తర్వాతే రాయాలనడం సబబు కాదు. ఈ విషయంలో సురేష్‌బాబు చేసిన వ్యాఖ్యలకు సినీ ప్రముఖులంతా మద్దతు తెలుపుతున్నారు.