తారాగణం: సూర్య, అనుష్క, శృతిహాసన్, రాధిక, క్రిష్, సూరి, నీతూ చంద్ర తదితరులు
నిర్మాణం: స్టూడియో గ్రీన్, పెన్ మూవీస్
నిర్మాత: మల్కాపురం శివకుమార్
సినిమాటోగ్రఫీ:ప్రియన్
సంగీతం: హారిస్ జైరాజ్
దర్శకత్వం: హరి
కథా కమామిషు:
సూర్య హీరోగా 'సింగం' సిరీస్‌లో ఇది మూడో సినిమా. మొదటి సినిమా తొలి పార్ట్‌లో పల్లెటూరి నేపథ్యం చివర్లో పట్టణానికి రావడం, రెండో సినిమా తొలి పార్ట్‌లో అంతా సిటీ వాతావరణం, చివర్లో విదేశాల్లో సందడి చేయడం చూశాం. మూడో సినిమాలో ఆస్ట్రేలియా నేపథ్యంలో సాగుతుంది. టౌన్ నుంచి ఆస్ట్రేలియాకి కథ మారుతుందన్నమాట. ఓ పోలీస్ కమిషనర్ హత్య చుట్టూ సాగే సినిమా ఇది. నిజాయితీగల ఓ పోలీస్ అధికారి, ఎక్కడో ఆస్ట్రేలియాలో తన సత్తా చాటడం, ఇండియన్ పోలీస్ అంటే ఏంటో నిరూపించడం ఈ సినిమాలో ముఖ్యమైన భాగం. అదేంటో తెరపై చూస్తేనే బాగుంటుంది.
నటీనటులెలా చేశారు:
'సింగం', 'సింగం-2' సినిమాల్లో పవర్‌ఫుల్ రోల్స్‌లో చెలరేగిపోయాడు సూర్య. దానికి ఏమాత్రం తగ్గని పవర్‌ఫుల్ రోల్ ఈ సినిమాలోనూ అతనికి దక్కింది. సూర్య వరకూ వంక పెట్టడానికేమీ లేదు. అయితే మొదటి సినిమాలో గ్రిప్ చూపించినంతగా, రెండో సినిమాలో ఉండదు. మూడో సినిమాలో కూడా గ్రిప్ తగ్గినట్లే అనిపిస్తుంది. హీరో పాత్ర తప్ప మిగతా పాత్రలపై అంతగా ఫోకస్ పెట్టకపోవడం రెండో సినిమాలో మైనస్. అదే ఇందులో కూడా రిపీట్ అయ్యింది.
హీరోయిన్లనూ దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయాడు. శృతిహాసన్‌ది కంప్లీట్‌గా గ్లామరస్ రోల్. అనుష్క మరీ లావెక్కిపోవడం అభిమానుల్ని నిరాశపరుస్తుంది. మిగతా పాత్రధారుల్లో విలన్లు స్టైలిష్‌గా కనిపించారు. రాధిక బాగా చేసింది.
సాంకేతిక వర్గం పనితీరు:
హీరో పాత్ర మీద పెట్టిన ఫోకస్, కథ మీద పెట్టకపోవడం ప్రధాన లోపం. కథనం పరంగా సెకెండాఫ్‌లో పరుగులు పెట్టించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. కథనం కూడా పెద్దగా ఆకట్టుకోదు. డైలాగ్స్ ఓకే. నేపథ్య సంగీతం బాగా కుదిరింది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. ఎడిటింగ్ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది. సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణ. యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ, పాటల్లోనూ కెమెరా పనితనం ఇంకా బాగా ఆకట్టుకుంటుంది.
విశ్లేషణ:
సింగం సిరీస్‌లో ఎన్ని సినిమాలొచ్చినా, తొలి సినిమా ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ఆ సినిమా ఇప్పటికీ కొత్తగానే ఉంటుందనడం నిస్సందేహం. రెండో సినిమాలోనూ సూర్య పవర్‌ఫుల్‌గా కనిపించినా మొదటి దానితో పోల్చితే తక్కువే అనిపిస్తుంది. రెండో సినిమా వచ్చాక దర్శకుడి ఆలోచనల్లో మార్పు వచ్చి ఉండాలి. అయితే యాక్షన్ ఒక్కటీ నమ్ముకుని దర్శకుడు సినిమా తీసినట్లుగా అనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ కోరుకునేవన్నీ సినిమాలో ఉన్నాయి. ఆ విషయంలో వంకపెట్టడానికేమీ లేవు. సూర్య లౌడ్ పెర్ఫామెన్స్ మాస్ ఆడియన్స్‌ని మెప్పిస్తుంది. అలాగే అందమైన లొకేషన్లు, బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్, అద్భుతమైన ఛేజ్‌లూ ఇవన్నీ యాక్షన్ లవర్స్‌ని మెప్పిస్తాయి. హీరోయిన్ల గ్లామర్ ఓకే. మాస్‌ని మెప్పించాలనే ఉద్దేశ్యంతో చేసిన ఈ సినిమా క్లాస్ ఆడియన్స్‌కి అంతగా కిక్ ఇవ్వడం కష్టమే. మాస్ ఆడియన్స్ మాత్రం పండగ చేసుకోవచ్చు.
ఫైనల్ వర్డ్:
మాస్ మెచ్చే యాక్షన్ సింగం