రీ ఎంట్రీలో 150వ సినిమాతో వచ్చి దుమ్ము దులిపేశాడు మెగాస్టార్ చిరంజీవి. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చి రికార్డులు కొల్లగొట్టి వెళ్లాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో చిరంజీవి నెక్స్ట్ సినిమాల్ని కూడా త్వరలోనే పట్టాలెక్కించేస్తాడని ఎదురు చూశారంతా. కానీ 'ఖైదీ నెంబర్ 150' వచ్చి నెల రోజులు కావస్తున్నా చిరంజీవి సినిమా ఇంకా సెట్స్ మీదికి వెళ్లలేదు. మరో పక్క చిరంజీవి కోసం సినిమా చేయడానికి డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఇద్దరు డైరెక్టర్లని ఓకే చేసి పెట్టాడు. అయితే కథ విషయంలోనే చర్చలు జరుగుతున్నాయంటున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో చిరంజీవి 151వ సినిమా ఉండబోతోందన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఈ సినిమాకి నిర్మాతన్న సంగతి కూడా విదితమే. అలాగే ఆ తర్వాతి సినిమాకి మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కూడా సిద్ధంగానే ఉన్నాడు. సురేందర్ రెడ్డితో సినిమా పూర్తి కాగానే బోయపాటి శీను సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి. మరో పక్క వినాయక్, అల్లు అరవింద్ కాంబినేషన్‌లో ఓ సినిమాకి కూడా రంగం సిద్ధమవుతోందనీ సమాచారమ్. డైరెక్టర్లు రెడీ, కథలు రెడీ మరింకా ఏంటి లేటు. చిరంజీవి ఎందుకు జాప్యం చేస్తున్నారు. వరుస సినిమాలు చేస్తానని చెప్పిన చిరు ఎందుకు స్లో అయ్యారు. ఫ్యాన్స్‌ని వేధిస్తోన్న ప్రశ్నలివి. అలాగే ఎంతో ఉత్కంఠతో అభిమానులు చిరంజీవి నెక్స్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. తొలి సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టిన చిరంజీవి తర్వాతి సినిమాతో 150 కోట్లు, 200 కోట్లు కొల్లగొట్టాలనీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.