బాలీవుడ్ యంగ్ స్టార్... సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన చివరి సినిమా `దిల్ బెచారా`. గత నెలలో విడుదల కావాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల సాధ్యపడలేదు. ఈ సినిమాని వీలైనంత త్వరగా చూడాలన్నది సుశాంత్ అభిమానుల కోరిక. కనీసం ఓటీటీ వేదికపై అయినా.. ఈ సినిమాని చూడాలని ఆశ పడుతున్నారు. వాళ్ల నిరీక్షణ ఫలించింది. త్వరలోనే హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని హాట్ స్టార్ సంస్థ స్వయంగా ప్రకటించింది.
జులై 24న ఈ చిత్రాన్ని హాట్ స్టార్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాని హాట్ స్టార్ భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసిందని సమాచారం. నిజానికి `దిల్ బెచారా` ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. హాట్ స్టార్ రాకతో.. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ గట్టెక్కేసినట్టే అని తెలుస్తోంది. తన అభిమాన హీరో చివరి సినిమా విడుదల కాబోతోంది. ఇక సుశాంత్ ఫ్యాన్స్‌కి ఇంత కంటే తీపి కబురు ఏముంటుంది? అతని సినిమాని విజయవంతం చేయడమే.. అభిమానులు ఇచ్చే ఘనమైన నివాళి.