'నా దారి రహదారి..' అనే సూపర్ స్టార్ డైలాగ్ ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినీ కెరీర్‌లో సూపర్ హిట్ మూవీ అయిన 'నరసింహా' సినిమాలోనిదీ డైలాగ్. అయితే ఈ డైలాగ్‌ని కేవలం సినిమా డైలాగ్‌లాగే కాకుండా, ఆయన తన జీవితానికి కూడా ఆపాదించుకోవడం విశేషం
జీవితంలో ఉన్నతి సాధించడం కోసం అడ్డదారుల్లో పనులు చేయడం అవివేకం అంటున్నారు రజనీకాంత్. ఆయన్ని సూపర్ స్టార్‌గా అభిమానులు భావిస్తున్నారు. చాలా సార్లు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ అభిమానులు చేసిన ప్రార్ధనలే తనని తిరిగి పూర్తి ఆరోగ్యవంతునిగా చేసేందుకు ఉపకరించాయనీ, ఆ అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేననీ అభిమానుల్ని ఉద్దేశించి రజనీకాంత్ చెప్పారు.
అయితే 'కాలా' సినిమా తర్వాత రజనీకాంత్ సినీ కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందనే విషయం దేవుడికే తెలియాలనీ ఆయన అన్నారు. అంటే ఈ సినిమా తర్వాత రజనీ సినిమాల్లో నటించరా? అనే డౌట్ అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం రజనీకాంత్ రాజకీయ ఎంట్రీపై ఆశక్తి నెలకొంది. గత నాలుగు రోజులుగా ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు. మీటింగుల్లో ప్రజలతో పాల్గొంటున్నారు. ఈ నెల 31వ తేదీన రాజకీయ ఎంట్రీపై ఖచ్చితమైన స్పష్టత ఇవ్వనున్నారనీ ఆయన చెప్పారు.
ప్రస్తుతం రజనీ నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 'రోబో 2.0' ఏప్రిల్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. మరో సినిమా 'కాలా' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకి రజనీ అల్లుడు, హీరో ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.