వెటరన్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పేరు చెప్పగానే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి. స్టార్ బలం లేకుండా కూడా అద్భుతాలు సృష్టించిన చరిత్ర ఆయనది. క్లీన్ సినిమాలకు కేరాఫ్. అయితే... అగ్ర హీరోల్ని హ్యాండిల్ చేయడంలో విఫలం అయ్యాడు. బాలయ్యతో టాప్ హీరో, నాగార్జునతో వజ్రం తీసి డిజాస్టర్లు మూట గట్టుకొన్నాడు. అప్పటి నుంచి... కృష్ణా రెడ్డి కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. పైగా.. హీరోగా మారి పెద్ద తప్పు చేశాడు కృష్ణారెడ్డి. అప్పటి నుంచీ అటు నటనకు, ఇటు దర్శకత్వానికీ దూరం కావాల్సివచ్చింది. ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తరవాత... మెగాఫోన్ పట్టి ఓ చిన్న సినిమా తీశాడు. త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక నుంచి డైరెక్షన్ కంటిన్యూ చేయాలన్నది కృష్ణారెడ్డి ప్లాన్. పైగా.. తను ఇప్పుడు ఇంకాస్త పెద్ద కలలు కంటున్నాడు. త్వరలో చిరంజీవితో సినిమా చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు కృష్ణారెడ్డి. ఇటీవల తను చిరంజీవిని కలిసినట్టు, సినిమా చేయాలని అనుకొంటున్నట్టు, దానికి చిరు కూడా సానుకూలంగా స్పందించినట్టు చెప్పుకొచ్చాడు. చిరు తనని ముందు నుంచీ ప్రోత్సహిస్తున్నారని, తనంటే ఆయనకు ఇష్టమని, అందుకే తమ కాంబోలో సినిమా రావడం ఖాయమని అంటున్నాడు.
''అప్పట్లో టాప్ హీరో తీశాను. అదేం ఫ్లాపు సినిమా కాదు. పంపిణీదారులకు లాభాలు తెచ్చి పెట్టిన సినిమానే. వజ్రం విషయంలో మాత్రం లెక్క తప్పింది. అదో రిమేక్ కథ. నా సొంత కథతో సినిమా తీస్తే ఫలితం వేరేలా ఉండేది'' అని చెప్పుకొచ్చాడు కృష్ణారెడ్డి. తాను హీరోగా మారడం కూడా ఓ పెద్ద పొరపాటే అని ఒప్పుకొన్నాడు. ''ఈ వయసులో కాకపోతే.. ఇంకెప్పుడు హీరోగా చేస్తా? అనే ఉద్దేశంతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చా. అభిషేకం తరవాత ఇంకెప్పుడూ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకొన్నా'' అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకొన్నారు కృష్ణారెడ్డి.