అక్టోబరు 2న సైరా విడుదల కాబోతోంది. దాదాపు 250 కోట్లతో రూపొందించిన చిత్రమిది. అందుకే ఆశలు, అంచనాలూ భారీగా ఉన్నాయి. 250 కోట్లని తిరిగి రాబట్టుకోవడం చిత్రబృందానికి ఓ పెద్ద ఛాలెంజ్. ఈ సినిమాని బాలీవుడ్‌లోనూ విడుదల చేయాలనుకుంటున్నారు కాబట్టి... అక్కడ ఈ సినిమా నిలబడితే - కచ్చితంగా పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవొచ్చు. అందుకే బాలీవుడ్ ప్రచారంపై సైరా బృందం ప్రత్యేకమైన దృష్టి సారించింది. బాలీవుడ్ కోసం ఓ కొత్త ప్రచార వ్యూహాన్ని రచిస్తోంది సైరా టీమ్.
ఈ సినిమాలోని టీజర్లు, ట్రైలర్లలకు రెండు వెర్షన్లు తయారు చేయించాలనుకుంటోంది. బాలీవుడ్‌లో ఈ సినిమాని అమితాబ్ బచ్చన్ సినిమాగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నార్ట. అందులో భాగంగా టీజర్, ట్రైలర్లలో బిగ్ బీని లీడ్ గా చేసుకుని కట్ చేయబోతున్నారు. అంటే.. బాలీవుడ్‌లో ఈ సినిమా అమితాబ్ బచ్చన్ సినిమాలా విడుదల చేస్తారన్నమాట.
మిలిగిన భాషలకు ఓ వెర్షన్, హిందీకి ఓ వెర్షన్ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేస్తే వర్కవుట్ అయ్యే ఛాన్సుందని చరణ్, చిరు భావిస్తున్నారు. ఆగస్టు 22న `సైరా` నుంచి టీజర్ వచ్చే అవకాశాలున్నాయి. అప్పుడే హిందీ వెర్షన్‌నీ విడుదల చేస్తారా? లేదంటే కొన్ని రోజులు ఆగి.. విడుదల చేస్తారా? అనేది చూడాలి. మొత్తానికి హిందీ బాక్సాఫీసుని షేక్ చేయాలని చిరు గట్టిగానే కంకణం కట్టుకున్నాడు. మరి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి.