'సైరా నరసింహారెడ్డి' సినిమాకి సంబంధించి అందరికీ ఒకటే అనుమానం. ఆ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు ముగింపు ఎలా వుంటుందోనని. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని, బ్రిటిష్ పాలకులు ఉరితీశారు. ఆ ఉరి కూడా ఆషామాషీగా కాదు, అత్యంత క్రూరంగా. ఆనాటి ఆ దారుణం గురించి చెబితే ఎవరికైనా కళ్ళు చెమర్చాల్సిందే.
మరి, చిరంజీవిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అలా చూడగలమా? అంటే, ఇది చరిత్ర.. మార్చలేని విషయం కాబట్టి రిస్క్ తీసుకోబోతున్నారనే అనుకోవాలి. బ్రిటిష్ పాలకులు అత్యంత క్రూరంగా వ్యవహరించబట్టే, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి అంతలా రగిలి, ఇప్పుడు మనం ఆ స్వాతంత్య్ర ఫలాల్ని అనుభవిస్తున్నాం. చరిత్రను వక్రీకరించేయబోతున్నారంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసుల పేరుతో కొందరు మీడియా ముందుకొచ్చి నానా యాగీ చేసిన విషయం విదితమే.
అప్పుడే దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. చరిత్రను వక్రీకరించే అవకాశమే లేదనీ, ఉయ్యాలవాడ ఘనతను మరింతగా చాటిచెప్పబోతున్నామని 'సైరా' టీమ్ పదే పదే చెబుతూ వస్తోంది. 'ఠాగూర్' సినిమా కోసం తమిళ 'రమణ'లో వున్నట్లుగా కాకుండా క్లయిమాక్స్ మార్చారు. అది కల్పిత కథ. 'సైరా నరసింహారెడ్డి' అలా కాదు. ఇక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకునే అవకాశం లేనే లేదు.
ఇది అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.