సైరా రివ్యూ: చరిత్రలో నిలిచిపోయే చిత్రం

మరిన్ని వార్తలు

సినిమా: సైరా
తారాగణం: చిరంజీవి, అమితాబ్, తమన్నా, నయనతార, జగపతి బాబు, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ తదితరులు
పాటల సంగీతం: అమిత్ త్రివేది
నేపథ్య సంగీతం: జులియస్ పక్కియం
కెమెరా: రత్నవేలు
ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రాం చరణ్
విడుదల: 2 అక్టోబర్ 2019
నిడివి: 2 గంటల 51 నిమిషాలు (171 నిమిషాలు)

 

రేటింగ్: 3.75/5


ఇది చరిత్రకి ఏ మాత్రం సంబంధం లేని సినిమా. బాహుబలి పూర్తి కాల్పనిక పాత్రలతో కాల్పనిక చిత్రం అయితే ఇది చారిత్రక పాత్రలతో కాల్పనిక చిత్రం. అందుకే సెన్సార్ బోర్డు కూడా "మొదటి స్వాతంత్ర సమరం" వంటి వాక్యాలను తీసేయమని చెప్పింది. ఇది మొదటి స్వాతంత్ర సమరం కానే కాదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కంటే దాదాపు 40 ఏళ్ల మునుపే వీరపాండియ కట్టబొమ్మన వంటి వాళ్లు ఇలాంటి తిరుగుబాటులు చేసారు. అంతవరకూ ఎటువంటి వివాదమూ లేని విషయం.

అయితే అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం వెనుక వివాదాలు కూడా ఉన్నాయి. ఆయన చేసింది స్వాతంత్ర పోరాటం కాదని ఒక కథనం ఉంది. ఈ సినిమా కథలోకి వెళ్ళే ముందు ఆసక్తి కలవారు ఆ చలామణీలో ఉన్న కథేమిటో ఒక్క సారి చూడండి. లేకపోతే స్కిప్ చేసి తర్వాతి ప్యారాలోకి వెళ్లిపోండి.



చలామణీలో ఉన్న చరిత్ర​ కథ:
ఈస్ట్ ఇండియా కంపెనీనుంచి పుచ్చుకున్న సైనిక సాయానికి బదులుగా 17 వ శతాబ్దం చివర్లో అప్పటి నిజాం రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను ఈస్ట్ ఇండియా కంపెనీ కి సీడెడ్ చేసాడు. అంటే ధారాదత్తం చేసాడు. అందుకే ఆ ప్రాంతంలోని జిల్లాలని ఇప్పటికీ సీడెడ్ ఏరియా అంటారు. అలా పుచ్చుకున్న భూముల్లో రైతులనుంచి సిస్తులు వసూలు చేసి తమకు ఇవ్వాలని ఈస్ట్ ఇండియా కంపెనీ కొందరిని నియమించింది. వాళ్ళే పాలెగాళ్లు. ఆ వ్యవస్థని పాలెగార్ వ్యవస్థ అనేవారు. అంటే రైతులనుంచి సిస్తులు వసూలు చేసి దొరలకి ఇవ్వడమే వీరి పని. అంటే దళారీలన్నమాట. ఆ క్రమంలో కొంత మార్జిన్ వారికి వదిలేసేవారు దొరలు. అలా కొన్నాళ్లు గడిచాక వసూలవుతున్న సిస్తులకి, పాలెగాళ్లు తమకి ఇచ్చే దానికి లెక్కలో పెద్ద తేడా వస్తోందని గ్రహించిన అప్పటి ఒక బ్రిటీష్ అధికారి ఆ పాలెగాళ్ల వ్యవస్థని ఎత్తేసి రైతులతో కంపెనీకి నేరుగా సంబంధాన్ని ఏర్పరిచాడు. ఒకరకంగా రైతులకి అది పెద్ద ఊరట. కానీ పాలెగాళ్లు గగ్గోలు పెట్టారు. తమ పరిస్థితి ఏమిటి అని కంపెనీకి మొరపెట్టుకున్నారు. దానికి ప్రతిఫలంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ కుటుంబాలు బ్రతకడానికి జీతాలు ఇవ్వసాగింది. అన్నేళ్లూ రైతుల సిస్తుకి, ఆ తర్వాత కంపెనీ జీతాలకి అలవాటు పడ్డ ఆ వంశీకులు సొంతంగా పనులు చేసుకోవడానికి దూరంగా ఉన్నారు. అలా రెండు తరాలు గడిచాక అటువంటి ఒక కుటుంబంలో నరసింహారెడ్డి పుట్టాడు. అతను తెల్ల దొరల మీద తిరుగుబాటు చేసాడు. దేనికి? పాలెగార్ వ్యవస్థని పునరుద్ధరించాలని. పునరుద్ధరించపోతే దేశం వదిలిపోవాలని. ఇదీ చలామణీలో ఉన్న ఒకానొక చరిత్రకథ.


ఈ కథని బలంగా నమ్మినవాళ్లకి "సైరా" ఒక కట్టుకథలా ఉంటుంది. అలా కాకుండా అసలు ఈ కథ ఏమిటో ఐడియా లేని వాళ్లకి మాత్రం "సైరా" నచ్చే అవకాశాలు ఉండొచ్చు. సహజంగా దేశభక్తికి సంబంధించిన సినిమాల్లో ఎమోషన్ పండించడం కాస్త తేలికే. ఇక "సైరా" సినిమా కథలోకి వెళదాం.



సైరా సినిమా కథ:
ఝాన్సీ లక్ష్మీబాయి (అనుష్క) తో కథ మొదలవుతుంది. 1857లో సిపాయిల తిరుగుబాటు సమయంలో తన రాజ్యంలో ఉన్నవారికి స్ఫూర్తినివ్వడానికి ఆవిడ అప్పటికి కొన్ని దశాబ్దాల క్రితమే స్వాతంత్రపోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెబుతుంది. అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి అసలు కథ మొదలవుతుంది. జలగర్భంలో ధ్యానం చేసుకుంటూ ఉన్న నరసింహారెడ్డి తెరమీద కనిపిస్తాడు. బ్రిటీష్ వారు సిస్తులు వసూలు చేస్తుంటారు. నరసింహారెడ్డి ఎందుకు కట్టాలని ఎదురు తిరుగుతాడు. నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న (అమితాబ్). బ్రిటీష్ వారి అరచకాలను విపరీతమైన ధైర్యంతో, తిరుగుబాటుతో, ఇతర వీరుల సాయంతో నరసింహారెడ్డి ఎలా ఎదుర్కున్నాడన్నదే సినిమా కథంతా.



కళాకారుల పనితీరు:
చిరంజీవి తప్ప ఇంకెవరూ ఈ పాత్రకు నప్పరు అనేది సత్యదూరం. ఏ స్టార్ హీరో చేసినా ఆ భారీతనంలో చక్కగా ఒదిగిపోతారు. అయితే చిరంజీవి చేసిన కృషిని మెచ్చుకోకుండా ఉండలేం. ఎప్పటికైనా ఒక పీరియడ్ సినిమాలో నటించాలనే ఆయన కోరికను చాలా నిబద్ధతతతో సాకారం చేసుకున్నారాయన.


తమన్నా అందంతోనూ అభినయంతోనూ ఆకట్టుకుంది. నయనతార నటనకూడా బాగానే పండింది. డైరెక్ట్ తెలుగు సినిమాలో తొలిసారి పూర్తి నిడివి పాత్ర వేసిన అమితాబ్ కూడా హుందాగా కనిపించారు.

పొరుగు రాష్ట్రాల మార్కెట్టుకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన సుదీప్, విజయ్ సేతుపతి కూడా తమతమ పాత్రల్లో సమపాళ్లల్లో నటించారు. జగపతి బాబు ఓకే.


జూలియస్ పక్కియం సమకూర్చిన నేపథ్య సంగీతం రిచ్ గా ఉంది. అమిత్ త్రివేది పాటలకందించిన సంగీతం మాత్రం ఒకటి రెండు పాటల మినహా అంతంతమాత్రమే అనిపించాయి.


ప్రథమార్ధం మందకొడిగా సాగుతుంది. పాత్రల పరిచయాలతో పాటు కథ ముందుకు సాగదు. కాస్త నిడివి తగ్గించినా పర్వాలేదనిపిస్తుంది. ద్వితీయార్థం మాత్రం ఊపందుకుని కథ పాకాన పడుతుంది. ఈలలతో దద్దరిల్లే సీన్లు, డయలాగులు ద్వితీయార్థంలోనే ఎక్కువ.



హైలైట్స్:
చిరంజీవి మాస్ ఇమేజ్
నిర్మాణ విలువలు
గ్రాఫిక్స్
యుద్ధసన్నివేశాలు
సెకండ్ హాఫ్



డ్రాబ్యాక్స్:
ప్ర‌ధ‌మార్థంలో తొలి స‌న్నివేశాలు
నెమ్మ‌దించిన‌ ద్వితీయార్థం



ముగింపు:
సాధారణంగా దేశభక్తి సినిమాలతో ప్రేక్షకులకు ఎమోషన్ తెప్పించడం అంత కష్టమైన పని కాదు. బేసిగ్గా దేశభక్తి విషయంలో అత్యధికులు సెంటిమెంటల్ గా ఉంటారు కాబట్టి కనెక్ట్ చేయడం తేలికే. దానికి తోడు అప్పటి బ్రిటీష్ అధికారుల దాష్టీకాలను చూపించేకొద్దీ దేశభక్తి పెల్లుబుకుతుంది. ఆనాటి "కాలాపానీ" నుంచి నేటి "మణికర్ణిక" వరకు ఆ అంశం ఆయా సినిమాల విజయానికి ఎంతో దోహదపడింది. ఈ సైరాలో కూడా ఆ దమనకాండని బాగానే చూపించారు. దాంతో హీరో చేసే యుద్ధానికి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఇక ఈ కథ వాస్తవానికి రాయలసీమ ప్రాంతంలో జరిగింది. కానీ భారీ సెట్టింగుల వల్ల ఆ వాతావరణం అస్సలు కనపడదు. గ్రాఫిక్స్ మాయాజాలంతో చరిత్ర పాఠం చూస్తున్నట్టు మాత్రం అనిపించదు. పైగా చిన్నపాటి గొడవను హాలీవుడ్ సినిమా "ట్రాయ్" వార్ సీన్ల రేంజులో చిత్రీకరించే ప్రయత్నం చేసారు. తెర మీద ఉన్నది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాదు...మన చిరంజీవే అనిపిస్తుంది. దానికి కారణం ఇన్నాళ్ళూ చాలామందికి అసలెవరో తెలియని ఉయ్యలవాడ నరసింహా రెడ్డి కన్నా దశాబ్దాలుగా వెండితెరనేలుతున్న చిరంజీవే అందరికీ సుపరిచితం. చిరంజీవికున్న మాస్ హీరో ఇమేజ్ ఉయ్యాలవాడ ఇమేజిని మింగేసింది అనుకోవాలి. ఇది బ్రిటీషు కాలంలో ఎవరి బయోపిక్కో అనిపించదు...రాజుల కాలం నాటి చిరంజీవి సినిమా..అంతే. ఎవరి పేరు తగిలించకుండా పూర్తి ఫిక్షన్ గా సింపుల్గా "సైరా" అని తీసినా ఇంతే మెగా ఎమోషన్ ఉండేది.


బాటం లైన్: ఇది పూర్తి వాస్తవ చరిత్ర కాదు- కానీ సినిమా చరిత్రగా మిగులుతుంది 

 
Review from Mumbai Press Show


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS