చిరంజీవి 'సైరా' ఇప్పుడు కాస్త ఇబ్బందులలో పడింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు ఇప్పుడీ సినిమాని అడ్డుకోవాలని చూస్తున్నారు. సినిమా పూర్తయినా, తమకు దక్కాల్సిన రాయల్టీ దక్కలేదని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ఉయ్యాలవాడ వంశస్థులు ఆందోళనకు దిగారు. ఆదివారం హైదరాబాద్‌లోని రామ్‌చరణ్ నివాసం ముందే... నరసింహారెడ్డి వంశస్థులు కొంతమంది ఆందోళనకు దిగారు.
తమకు న్యాయం జరక్కపోతే ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ ఇష్యూ ఇప్పటికే కోర్టుకెక్కింది. ''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులుకొందరు `సైరా` విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని'' చిత్రబృందం కోర్టుకు వెళ్లింది. జులై 10న ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు జరగబోతున్నాయి. ఆ తరవాతే తీర్పు వెలువడుతుంది. అప్పటి వరకూ ఈ కేసుకు సంబంధించి బహిరంగంగా ఏమీ మాట్లాడకూడదని చిత్రబృందం సైలెంట్‌గా ఉంది. కోర్టులో తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో చూడాలి.