టాలీవుడ్ కి కొత్త కళ వచ్చింది. సినిమాలన్నీ వరుస కడుతున్నాయి. హిట్లూ, ఫ్లాపుల సంగతి పక్కన పెడితే - కొత్త సినిమాల రాక వల్ల, థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈవారం రెండు సినిమాలు ప్రేక్షకుల తీర్పు కోరుతూ వచ్చాయి. అవే కల్కి, బ్రోచేవారెవరురా ఇది వరకు రాజశేఖర్ సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ `గరుడవేగ`తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు రాజశేఖర్. ఆ సినిమా హిట్టవ్వడంతో తదుపరి `కల్కి`పై అంచనాలు పెరిగాయి.
ప్రశాంత్ వర్మ దర్శకుడు అవ్వడం, ప్రచార చిత్రాలు బాగుండడంతో బిజినెస్ పరంగానూ క్రేజ్ వచ్చింది. అయితే శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అంచనాల్ని అందుకోవడంలో కొంత ఇబ్బంది పడింది. టేకింగ్, మేకింగ్ బలంగా ఉన్నా - కథని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలం అయ్యాడనే చెప్పాలి. పతాక సన్నివేశాలు మాత్రం థ్రిల్లింగ్ గా సాగాయి. ఆ అరగంట.. ఈ సినిమాని నిలబెట్టింది. దాంతో యావరేజ్ మార్క్ దగ్గర ఈ సినిమా ఆగిపోయింది. శ్రీవిష్ణు, నివేదాథామస్, సత్య, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలు పోషించిన `బ్రోచేవారెవరురా` కూడా ఇదే వారం విడుదలైంది. ఈ చిత్రానికి మాత్రం మంచి స్పందన వస్తోంది.
క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటోంది. తొలి సగం నవ్విస్తే.. రెండో సగం థ్రిల్ కలిగించింది. అక్కడక్కడ లోటు పాట్లు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా బాక్సాఫీసు దగ్గర పాసైపోయింది. కల్కితో పోలిస్తే ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. విడుదలకు ముందే ఈ సినిమా సేఫ్ అయిపోయింది. ఈవారం విడుదల కావాల్సిన `బుర్రకథ` అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అదెప్పుడు విడుదల చేస్తారో ఇంకా తేలలేదు. వచ్చే వారం `ఓబేబీ` వస్తోంది. సమంత కథానాయికగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.